యూకేలోనూ ముంబై తరహా దాడులు? | Sakshi
Sakshi News home page

యూకేలోనూ ముంబై తరహా దాడులు?

Published Fri, Jan 9 2015 3:32 PM

యూకేలోనూ ముంబై తరహా దాడులు? - Sakshi

బ్రిటన్లో కూడా భారీ సంఖ్యలో సామాన్యుల ప్రాణాలను బలిగొనేందుకు అల్ కాయిదా ఉగ్రవాద సంస్థ కుట్రలు పన్నుతోంది. ఈ విషయాన్ని స్వయంగా బ్రిటిష్ నిఘా సంస్థ అత్యున్నత అధికారే వెల్లడించారు. ఏదైనా ప్రయాణికుల విమానాన్ని పేల్చేయడం గానీ, ముంబై తరహాలో రద్దీ ప్రదేశాల్లో కాల్పులు జరపడం గానీ, లేదా వాహనాలను ఉపయోగించి హిట్ అండ్ రన్ దాడులు గానీ చేయొచ్చని అనుమానిస్తున్నారు. ఉగ్రవాదులు ఈ రకమైన కుట్ర పన్నుతున్నట్లు స్పష్టమైన ఆధారాలున్నాయని ఎంఐ5 సెక్యూరిటీ సర్వీస్ డైరెక్టర్ జనరల్ ఆండ్రూ పార్కర్ చెప్పారు. ఇటీవలి కాలంలో బ్రిటిష్ పోలీసులు, ఎంఐ5 కలిసి మూడు ఉగ్రవాద కుట్రలను భగ్నం చేశాయన్నారు. అయితే, ప్రతిసారీ కుట్రలను తాము అడ్డుకోగలమని మాత్రం వీలైనంత వరకు తాము ప్రయత్నం చేస్తూనే ఉంటామని.. అయితే.. వాళ్లు కూడా రాను రాను కొరకరాని కొయ్యల్లా తయారవుతున్నారని పార్కర్ వ్యాఖ్యానించారు.

ప్యారిస్ తరహా దాడులకు కొంతమంది ఉగ్రవాదులు పాల్పడతారేమోనన్న అనుమానంతో బ్రిటిష్ పోర్ట్లాండ్ సాయుధ పోలీసులు అణువణువూ గాలిస్తున్నారు. లండన్ లోని యూరోస్టార్ టెర్మినల్ వద్ద భద్రత పెంచారు. ఇప్పటికే సిరియా, ఇరాక్ దేశాల నుంచి కొంతమంది బ్రిటిష్ జీహాదీలు స్వదేశానికి తిరిగి వస్తున్నారని, వాళ్లు ఈ దాడులకు తెగబడే ప్రమాదం ఉందని అనుమానిస్తున్నారు. బ్రిటన్ నుంచి సిరియా వెళ్లిన 600 మంది బ్రిటిష్ వాళ్లలో ఎక్కువ మంది ఐఎస్ ఉగ్రవాద సంస్థలో చేరినట్లు తెలుస్తోంది.

Advertisement
Advertisement