కడుపులో ఈతకొట్టే కొత్త రోబో..! | Sakshi
Sakshi News home page

కడుపులో ఈతకొట్టే కొత్త రోబో..!

Published Wed, Aug 3 2016 3:48 PM

కడుపులో ఈతకొట్టే కొత్త రోబో..! - Sakshi

ఇజ్రాయెల్ః శరీర లోపలి భాగాలను పరీక్షించేందుకు ఎక్స్ రేలు, స్కానింగ్ లు తీయించే కాలం చెల్లి పోయింది.  ప్రతి పనికీ రోబోను వినియోగిస్తున్నట్లే ఇకపై వైద్య పరీక్షల్లోనూ రోబోల ప్రాధాన్యత మరింత పెరగనుంది. ఇప్పుడు శరీరంలోని ఆరోగ్య పరిస్థితులను పరిశీలించేందుకు పరిశోధకులు ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగించి అతిచిన్న రోబోను సృష్టించారు. ఆ సూక్ష్మ పరికరం కడుపులో ఈతకొడుతూ, అన్నివైపులకు సంచరిస్తూ రోగికి సంబంధించిన ప్రతివిషయాన్నీ పరిశీలించి వివరాలను వెల్లడిస్తుంది. ఎస్ఏడబ్ల్యూ (సా..) పేరున తరంగంలా నడిచే  రోబోను వైద్యపరీక్షలకోసం  ప్రవేశ పెట్టడం ఇదే మొదటిసారి.

కడుపులో ఈత కొడుతూ వైద్య పరీక్షలు నిర్వహించే కొత్త రోబోను ఇజ్రాయెల్ నెగేవ్ (బిజియు) కు చెందిన బెన్-గురియన్ విశ్వవిద్యాలయం ఇంజనీర్లు మొదటిసారి అభివృద్ధి పరిచారు.  ఈ అద్భుతమైన చోదక శక్తి కలిగిన పరికరం కడుపులో పైకీ కిందికీ పాకుతూ, ఇసుక గడ్డిలా ఉండే అస్థిరమైన భాగాల్లోనూ సంచరించగలిగేలా మొదటిసారి డిజైన్ చేశారు. సెకనుకు 57 సెంటీమీటర్ల వేగంతో సంచరించగలిగే ఈ రోబో కేవలం ఓ మోటార్ తో పనిచేస్తుంది. శాస్త్రవేత్తలు ఇప్పుడు దీన్ని మరింత సూక్ష్మంగా రూపొందిస్తే...  వైద్యులు, సర్జన్లు.. రోగుల అంతర్గత పరీక్షలు నిర్వహించేందుకు ఉపయోగించేందుకు వీలుగా ఉంటుందని చెప్తున్నారు. అలాగే పర్వతాల్లోనూ, కోస్ట్ గార్డ్ కార్యకలాపాలు నిర్వహించేందుకు సైతం ఇటువంటి మైక్రోస్కోపిక్ రోబోను వినియోగించవచ్చని అంటున్నారు.

 తరంగం (వేవ్) లాంటి కదలికలు కలిగిన రోబోను రూపొందించేందుకు ప్రపంచవ్యాప్తంగా పరిశోధకులు తొంభై ఏళ్ళుగా ప్రయత్నిస్తున్నారని.. మెకానికల్ ఇంజనీరింగ్ బిజియు శాఖ, మరియు బయో ఇన్స్ పైర్డ్ అండ్ మెడికల్ రోబోటిక్ ల్యాబ్ హెడ్.. డాక్టర్ డేవిడ్ జరౌక్ తెలిపారు. ఇప్పుడు తాము వివిధ ప్రయోజనాలకోసం, వివిధ పరిమాణాల్లో వినియోగించే ఈ రోబోట్ ను రూపొందించి సక్సెస్ అయినట్లు చెప్తున్నారు. ఒక సెంటీమీటర్ లేదా అంతకన్నా తక్కువ పరిమాణంలో ఉండే ఈ సూక్ష్మ పరికరం.. శరీరంలో ప్రవేశించి జీర్ణవ్యవస్థను పరిశీలించేందుకు, బయాప్సీ వంటివి నిర్వహించేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందని, అలాగే శోధన, సహాయక కార్యక్రమాల్లోనూ ఈ మైక్రోస్కోపిక్ రోబో వినియోగించేందుకు వీలుగా తయారు చేసినట్లు చెప్తున్నారు.

Advertisement
Advertisement