నెట్‌ న్యూట్రాలిటీకి అమెరికా గుడ్‌ బై!  | Sakshi
Sakshi News home page

నెట్‌ న్యూట్రాలిటీకి అమెరికా గుడ్‌ బై! 

Published Fri, Dec 15 2017 9:47 PM

america goodbye to net neutrality - Sakshi

వాషింగ్టన్‌: గత ప్రభుత్వాల నిర్ణయాలను తోసిపుచ్చుతూ అందుకు విరుద్ధంగా వరుస నిర్ణయాలను తీసుకుంటున్న ట్రంప్‌ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం.. తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. ఇకపై తమ దేశంలో నెట్‌ న్యూట్రాలిటీకి గుడ్‌ బై చెబుతున్నట్లు ప్రకటించింది. 2015లో ఒబామా ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనలను రద్దు చేసింది. అమెరికా ఫెడరల్‌ కమ్యూనికేషన్స్‌ కమిషన్‌ (ఎఫ్‌సీసీ) నెట్‌ న్యూట్రాలిటీకి వ్యతిరేకంగా ఓటేసింది. అమెరికాలోని ఏటీఅండ్‌టీ, కామ్‌కాస్ట్, వెరిజాన్‌లాంటి ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్ల(ఐఎస్‌పీ)కు దక్కిన ఘన విజయంగా దీనిని అభివర్ణిస్తున్నారు. కాగా.. నెట్‌ న్యూట్రాలిటీ వద్దని ఐఎస్‌పీలు, కావాలని కంటెంట్‌ ప్రొవైడర్లు వాదిస్తున్నారు.  

అసలేంటీ నెట్‌ న్యూట్రాలిటీ? 
నెట్‌ న్యూట్రాలిటీ అంటే కంటెంట్‌ ప్రొవైడర్లందరికీ సమానమైన నెట్‌ హక్కులు ఉండటం.  అన్ని వెబ్‌సైట్లకు సమానమైన నెట్‌ యాక్సెస్‌ ఉండాలన్నది నెట్‌ న్యూట్రాలిటీ ఉద్దేశం. దీనివల్ల ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్లు కావాలని కొన్ని సైట్లను స్లో చేయడం, బ్లాక్‌ చేయడం లేదా కొన్ని సైట్ల స్పీడు పెంచడంలాంటివి చేయకుండా ఈ నిబంధనలు అడ్డుకుంటున్నాయి.  దీనివల్ల ఒకరు డబ్బులు ఎక్కువగా ఇచ్చారు కదా అని ఆ వెబ్‌సైట్‌కు పోటీగా వస్తున్న వెబ్‌సైట్ల వేగాన్ని ఎలా పడితే అలా తగ్గించే వీలు ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్లకు ఉండదు. 

దీనివల్ల నష్టం ఏంటి? 
నెట్‌ న్యూట్రాలిటీని ఎత్తేయడం వల్ల ఫేస్‌బుక్, యూట్యూబ్‌లాంటి పెద్ద సంస్థలకు పోటీగా ఉన్న విమియో, రెడిట్‌లాంటి వెబ్‌సైట్లకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. తమకు పోటీగా రాకుండా ఉండేందుకు ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్లకు ఎంతైనా చెల్లించడానికి పెద్ద సంస్థలు సిద్ధంగా ఉంటాయి. దీంతో వీళ్ల వెబ్‌సైట్ల వేగం పెరిగి.. వీళ్లకు పోటీగా ఎదుగుతున్న చిన్న వెబ్‌సైట్లు కనుమరుగైపోయే ప్రమాదం కూడా ఉంటుంది.   

Advertisement
Advertisement