ఎట్టకేలకు తలొగ్గిన యాపిల్ కంపెనీ! | Sakshi
Sakshi News home page

ఎట్టకేలకు తలొగ్గిన యాపిల్ కంపెనీ!

Published Tue, Mar 29 2016 9:40 AM

ఎట్టకేలకు తలొగ్గిన యాపిల్ కంపెనీ! - Sakshi

గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న హైడ్రామా తర్వాత యాపిల్ సంస్థ ఎట్టకేలకు వెనక్కి తగ్గింది. వివాదాస్పదంగా మారిన టెర్రెరిస్టు ఐఫోన్ ను అన్ లాక్ చేయడానికి కొత్త ప్రోగ్రామ్ డెవలప్ చేసి ఇచ్చేందుకు సోమవారం అంగీకరించింది. ఐఫోన్‌ అన్‌లాక్‌ విషయంలో యాపిల్‌ కంపెనీకి, అమెరికా ప్రభుత్వానికి గతేడాది డిసెంబర్ నుంచి వాదనలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే శాన్‌బెర్నార్డినో లో కాల్పులు జరిపిన ఉగ్రవాది ఐఫోన్‌ను అన్‌లాక్‌ చేయాలని గతంలో అమెరికా దిగువ కోర్టులు ఆదేశాలు జారీచేసినా యాపిల్‌ సంస్థ అందుకు నిరాకరిస్తూ వచ్చింది. ఆ కంపెనీకి వ్యతిరేకంగా మరో కేసును ఆ దేశ న్యాయవిభాగం కోర్టు ముందు ఈ ఏడాది మొదట్లో ఉంచింది.


గతేడాది డిసెంబర్ 2 న సయీద్ ఫరూక్, తష్ఫిన్ మాలిక్ దంపతులు కాలిఫోర్నియా లోని శాన్ బెర్నార్డినోలో విచక్షణా రహితంగా కాల్పులు జరిపి 14 మందిని పొట్టనపెట్టుకున్నారు. అనంతరం పోలీసుల కాల్పుల్లో వీరిద్దరూ హతమైన విషయం తెలిసిందే. అయితే ఫరూక్ ఐఫోన్ను డీకోడ్ చేసి సమాచారాన్ని సేకరించాలనుకున్న ఎఫ్బీఐ అధికారులకు యాపిల్ హై సెక్యూరిటీ టెక్నాలజీ అడ్డుగా నిలిచింది. దీంతో యాపిల్ సంస్థ ఎఫ్బీఐకి ఈ సాంకేతిక సహకారాన్ని అందించాల్సిందిగా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. చాలా రోజులుగా ఇందుకు నిరాకరిస్తూ వచ్చిన యాపిల్ యాజమాన్యం ప్రత్యామ్నాయంగా కొత్త ప్రోగ్రామ్ ను సిద్ధం చేసి ఇచ్చేందుకు అంగీకరించింది. దీంతో యాపిల్ పై దాఖలైన పిటిషన్, కేసులను అమెరికా ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని తాము ఈ సహాయం చేసేందుకు ముందుకు వచ్చామని ఆ సంస్థకు చెందిన ఓ అధికారి వెల్లడించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement