అమెరికా క్షిపణి ప్రదర్శన | Sakshi
Sakshi News home page

అమెరికా క్షిపణి ప్రదర్శన

Published Thu, Jul 6 2017 2:26 AM

అమెరికా క్షిపణి ప్రదర్శన - Sakshi

ఉ.కొరియా ప్రయోగానికి దీటుగా..
 
వాషింగ్టన్‌: ఉత్తర కొరియా ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణి (ఐసీబీఎం)ని ప్రయోగించడానికి ప్రతిగా దక్షిణ కొరియా, అమెరికా సంయుక్తంగా మంగళవారం క్షిపణి ప్రదర్శన నిర్వహించాయి. ధిక్కార ధోరణిని అవలంభిస్తున్న ఉత్తర కొరియాకు తమ బలమేంటో చూపడానికి దక్షిణ కొరియా ప్రాదేశిక జలాల్లోకి క్షిపణులను ప్రయోగించినట్లు అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్‌లో ముఖ్య అధికార ప్రతినిధి డానా వైట్‌ చెప్పారు. ఆర్మీ టాక్టికల్‌ మిసైల్‌ సిస్టం(ఏటీఏసీఎంఎస్‌), దక్షిణ కొరియాకు చెందిన హ్యున్మూ మిసైల్‌ 2ను ఈ కసరత్తులో వినియోగించినట్లు దక్షిణ కొరియాలోని అమెరికా రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి.

ఉత్తర కొరియా నుంచి ముప్పు నేపథ్యంలో తమ మిత్ర దేశాలైన దక్షిణ కొరియా, జపాన్‌ల రక్షణకు కట్టుబడి ఉన్నామని అమెరికా తెలిపింది. ఉత్తరకొరియా అణ్వాయుధాలు పోగుచేయడం అమెరికాకు ఆమోదయోగ్యం కాదని యూఎస్‌ విదేశాంగ మంత్రి రెక్స్‌ టిల్లర్‌సన్‌ స్పష్టం చేశారు. ఉత్తరకొరియా ముప్పును ఎదుర్కోవాలంటే అంతర్జాతీయ స్థాయిలో చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. ఉత్తరకొరియాలో తాజా పరిణామాలపై చర్చించడానికి యూఎన్‌ భద్రతా మండలిని అత్యవసరంగా సమావేశపరచాలని విజ్ఞప్తి చేశారు. ఉత్తర కొరియా చర్యలను యూఎన్‌ ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గ్యుటెరెస్‌ ఖండించారు. ఇలాంటివి ప్రాంతీయంగా ఉద్రిక్తతలను పెంచుతాయని ఆందోళన వ్యక్తం చేశారు.
 
అణు వార్‌హెడ్లను మోసుకెళ్లగల ఐసీబీఎం:
ఉత్తరకొరియా ప్రయోగించిన తొలి ఖండాంతర క్షిపణి భారీ అణు వార్‌హెడ్లను మోసుకెళ్లగలదని, భూ వాతావరణంలోకి తిరిగొచ్చిన తరువాత కూడా మనగలదని ఆ దేశ అధికారిక వార్తా సంస్థ వెల్లడించింది. క్షిపణి పరీక్షను వ్యక్తిగతంగా పర్యవేక్షించిన తరువాత అధ్యక్షుడు కిమ్‌ స్పందిస్తూ...‘యూఎస్‌ స్వాతంత్య్ర దినోత్సవం రోజైన జూలై 4న పంపిన ఈ కానుకతో అమెరికా వెధవలు సంతోషపడలేదు’ అని వ్యాఖ్యానించినట్లు ది కొరియన్‌ సెంట్రల్‌ న్యూస్‌ ఏజెన్సీ పేర్కొంది. 

Advertisement
Advertisement