అడవికి అమ్మలాంటిది.. | Sakshi
Sakshi News home page

అడవికి అమ్మలాంటిది..

Published Wed, Mar 26 2014 4:12 AM

అడవికి అమ్మలాంటిది..

 సైన్స్ ఫిక్షన్ సినిమాల్లోని భవంతిలా కనిపిస్తోంది కదూ.. ఇది ఓ ఆకాశహర్మ్యం డిజైన్. ముఖ్యంగా అడవులను సంరక్షించడానికి, పర్యావరణ పరిశోధనలు చేయడానికి ఉద్దేశించినది. దీని పేరు రెయిన్ ఫారెస్ట్ గార్డియన్. అడవికి అమ్మలాంటిదన్నమాట. మొన్న శేషాచల అడవుల్లో కార్చిచ్చు రేగిందే.. ఇలాంటిదే అక్కడుంటుంటే.. క్షణాల్లో దాన్ని ఆర్పేసే వీలుండేది. ఈ ఆకాశహర్మ్యంలో వాటర్ టవర్‌తోపాటు అగ్నిమాపక కేంద్రం, వాతావరణ, పరిశోధన కేంద్రాలు ఉంటాయి. అమెజాన్ అడవుల కోసం ఈ డిజైన్‌ను తయారుచేశారు.

ఇందులో ఉండే వాటర్ టవర్ వర్షపు నీటిని సేకరిస్తుంది. దాన్ని ఫిల్టర్ చేసి... అందులోని రిజర్వాయర్లలో భద్రపరుస్తుంది. మర్రిచెట్టుకుంటే ఊడల్లా కనిపిస్తున్న ఈ తీగలు.. భూమిలోని అదనపు నీటిని స్పాంజిలా పీల్చుకుని.. భద్రపరుస్తాయి. పైనుంచి అడవి మొత్తాన్ని పర్యవేక్షించే సదుపాయమూ ఉంది. ఎక్కడైనా చిన్న నిప్పు పుట్టినా.. వెంటనే గుర్తించి.. అక్కడికి ద్రోన్స్‌ను పంపుతుంది. ముందునుంచే సేకరించి ఉంచిన వర్షపు నీటితో అవి మంటలను ఆర్పేస్తాయి. అంటే.. మనుషులు అక్కడికి వెళ్లాల్సిన పనిలేదన్నమాట. అవే ఆటోమెటిక్‌గా ఆర్పేసి వచ్చేస్తాయి. అంతేకాదు.. వర్షాలు లేని సమయంలో నీటిని సరఫరా చేస్తూ.. అడవంతా పచ్చగా ఉండేలా చూస్తుంది. ఈ డిజైన్ ఇంత బాగుంది కాబట్టే.. 2014 ఈవాల్వో మేగజీన్ ఆకాశహర్మ్య పోటీలో బహుమతిని సైతం కొట్టేసింది.
 

Advertisement
Advertisement