మరో శకలం లభ్యం: ఎంహెచ్ 370 విమానానిదిగా అనుమానం | Sakshi
Sakshi News home page

మరో శకలం లభ్యం: ఎంహెచ్ 370 విమానానిదిగా అనుమానం

Published Sun, Aug 2 2015 4:05 PM

మరో శకలం లభ్యం: ఎంహెచ్ 370 విమానానిదిగా అనుమానం

కౌలాలంపూర్: ఎంహెచ్ 370 విమానానిదిగా భాబిస్తున్న మరో శకలం హిందూ మహాసముద్రంలోని రీయూనియన్ దీవిలో ఆదివారం లభించింది. బుధవారం కూడా ఇలాంటిదే ఓ శకలం వెలుగులోకి రావడం, పరీక్షల నిమిత్తం దానిని ఫ్రాన్స్ కు పంపిన సంగతి తెలిసిందే. ఆదివారం కనుగొన్న శకలం.. రీయూనియన్ ద్వీప రాజధాని సెయింట్ డెనిస్ నగరంలో దొరికింది.

మొదట దొరికిన విమాన శకలం.. బోయింగ్ 777 విమానానికి చెందినదేనని, ఏడాదిన్నర కిందట అంతుచిక్కని రీతిలో అదృశ్యమైన  ఎమ్‌హెచ్ 370 విమానం కూడా ఇదే రకానికి చెందినదని మలేసియా ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఈ రెండు శకలాలూ ఎంహెచ్ 370వే అయివుంటాయనే అభిప్రాయాలు బలపడుతున్నాయి.

కాగా, అదృశ్యమైన విమానంపై దర్యాప్తునకు సారథ్యం వహిస్తున్న ఆస్ట్రేలియా.. దొరికిన శకలం ఎమ్‌హెచ్ 370 విమానానిదైనా.. విమానం కుప్పకూలిన ప్రాంతాన్ని కనిపెట్టడం కష్టమని పేర్కొంది.  గత ఏడాది మార్చి 18న కౌలాలంపూర్ నుంచి బీజింగ్‌కు 239 మంది ప్రయాణికులతో వెళ్తున్న మలేసియాకు చెందిన ఎమ్‌హెచ్ 370 విమానం హిందూ మహాసముద్రం పరిధిలో అదృశ్యమైన విషయం తెలిసిందే. అ విమానంలో ఐదుగురు భారతీయులు కూడా ఉన్నారు. కాగా, ఇన్నాళ్లుగా గాలిస్తున్నా అదృశ్యమైన విమానానికి సంబంధించి ఏలాంటి ఆధారాలను దర్యాప్తు అధికారులు కనుక్కోలేకపోయారు.

Advertisement
Advertisement