ఐఫోన్ 6 పేలుడు కలకలం | Sakshi
Sakshi News home page

ఐఫోన్ 6 పేలుడు కలకలం

Published Tue, Aug 2 2016 1:49 PM

ఐఫోన్ 6 పేలుడు కలకలం

సిడ్నీ: ఐఫోన్ 6 పేలి ఓ వ్యక్తి గాయపడిన ఘటన ఆస్ట్రేలియాలో కలకలం రేపింది. సిడ్నీకి చెందిన మేనేజ్మెంట్ కన్సల్టెంట్ గారెత్ క్లియర్ బైకుపై వెళుతుండగా వెనుక జేబులో పెట్టుకున్న ఐఫోన్ నుంచి ఒక్కసారిగా మంటలు ప్రారంభమయ్యాయి. దీంతో కంగారుపడిన అతడు బైకు పైనుంచి కింద పడిపోయాడు. తర్వాత ఫోన్ పోలిపోయింది. ఫోన్ నుంచి పొగ, వేడి వస్తున్నట్టుగా గుర్తించిన కొద్దిసేపటికే పేలిపోయిందని 'ది డైలీ టెలిగ్రాఫ్' తెలిపింది.

కుడికాలి తొడ భాగంలో కాలిన గాయాలు కావడంతో అతడిని సిడ్నీలోని రాయల్ నార్త్ షోర్ ఆస్పత్రిలో చేర్చారు. అతడికి స్కిన్ గ్రాఫ్ట్ సర్జరీ చేయనున్నారు. బ్యాటరీలోని లిథియం కారణంగానే మంటలు వ్యాపించివుండొచ్చని అనుమానిస్తున్నారు. ఫోన్ల తయారీ సంస్థలు భద్రతా ప్రమాణాలు గాలికి వదిలేస్తున్నాయని, వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని గారెత్ క్లియర్ సూచించాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఫొటోను ట్వీటర్ లో పోస్ట్ చేశాడు. ఐఫోన్ పేలిన ఘటనపై యాపిల్ సంస్థ స్పందించింది. దీనిపై విచారణ జరుపుతామని ప్రకటించింది. ఐఫోన్ 6 పేలినట్టు గతేడాది, జూన్ లో కూడా వార్తలు వచ్చాయి.

Advertisement
Advertisement