నిశ్శబ్ద ఉద్యమం వెనుక కృత్రిమ మేధ | Sakshi
Sakshi News home page

నిశ్శబ్ద ఉద్యమం వెనుక కృత్రిమ మేధ

Published Wed, Apr 18 2018 2:05 AM

Artificial intelligence behind the silent movement

వాషింగ్టన్‌: కృత్రిమ మేధ, భౌగోళిక సమాచార వ్యవస్థ (జీఐఎస్‌), బిగ్‌ డేటాలను వినియోగించడంతో ఏప్రిల్‌ 2 నాటి భారత్‌ బంద్‌కు పిలుపు వచ్చిందని తేలింది. ఈ బంద్‌ వెనుక అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న ఓ దళిత సంస్థ ఉన్నట్లు తెలిసింది. అక్రమ కేసుల్లో ఇరుక్కుంటున్న వారికి రక్షణ కల్పించేందుకు ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టంలో సుప్రీంకోర్టు స్వల్ప సవరణలు చేయడంతో దళితులు చేపట్టిన భారత్‌ బంద్‌ హింసాత్మకమై 13 మంది చనిపోయారు.

న్యూజెర్సీకి చెందిన దిలీప్‌ మాస్కే అనే వ్యక్తి అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో ఉంటున్న దాదాపు వంద మందికిపైగా దళితులతో ఓ రహస్య బృందాన్ని ఏర్పాటు చేశారు. యూపీ, మధ్యప్రదేశ్, రాజస్తాన్, బిహార్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లోని 100 లోక్‌సభ నియోజకవర్గాలపై తాము దృష్టి పెట్టామనీ, అక్కడ గెలుపోటములను ప్రభావితం చేస్తామని బృందంలోని కొందరు అన్నారు.

ఏప్రిల్‌ 2 నాటి భారత్‌ బంద్‌కు కృత్రిమ మేధ ద్వారా తాము ప్రయోగాత్మకంగా పిలుపునిచ్చామని దిలీప్‌ అన్నారు. కొన్నేళ్లుగా కృత్రిమ మేధ సాయంతో ఆన్‌లైన్‌ నుంచి డేటా సేకరించామనీ, రాజకీయ వర్గాలకు వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహించేందుకు ప్రణాళికలు రచించామన్నారు. లండన్‌కు చెందిన ఓ కంపెనీ నుంచి డేటా కొన్నామని చెప్పారు.

Advertisement
Advertisement