ఈ బస్సులో వెళితే నరకం చూడొచ్చు! | Sakshi
Sakshi News home page

ఈ బస్సులో వెళితే నరకం చూడొచ్చు!

Published Wed, Aug 17 2016 2:21 PM

ఈ బస్సులో వెళితే నరకం చూడొచ్చు!

బస్సుల్లో విహారయాత్రలకు వెళ్లేవాళ్లు వినోదంతో పాటు ఉల్లాసమైన ప్రయాణాన్ని కోరుకోవడం సహజం. పోలండ్‌లోని అందమైన పర్యాటక ప్రాంతాలను తిప్పి చూపించే చెక్ దేశానికి చెందిన ఓ పర్యాటక సంస్థ మాత్రం తాను నడుపుతున్న బస్సులో ప్రయాణికులకు నరకాన్ని చూపిస్తోంది. నరకం చూపించడమంటే బస్సు సౌకర్యవంతంగా లేదని కాదు... బస్సు వెలుపల వేసిన కలర్ స్టిక్కర్లు రెండో ప్రపంచయుద్ధం సందర్భంగా నాజీలు పోలండ్‌లోని ఆశ్‌విట్‌లో నడిపిన డెత్ కాన్సంట్రేషన్ క్యాంప్ చేదు జ్ఞాపకాలను గుర్తు చేస్తోంది.

అనాటి ఆ క్యాంప్‌లో 11 లక్షల మందిని నాజీలు అన్యాయంగా చంపేశారు. వారిలో 90 శాతం మంది యూదులే. మరణించిన వారిలో 1,50,000 మంది పోలండ్ దేశస్థులు, 23 వేల మంది రొమేనియన్లు, 15 వేలమంది రష్యన్ ఖైదీలు కూడా ఉన్నారు. 11 లక్షల మందిలో కొంతమందిని ఉరి తీయగా, మరికొంత మందిని ఆకలిదప్పులతో మాడ్చి చంపేయగా, లక్షలాది మందిని గ్యాస్ ఛాంబర్లలో చంపేశారు. ఇలాంటి గత చారిత్రక వాస్తవాలను ప్రజలకు తెలియజేసేందుకు చెక్ పర్యాటక సంస్థ విజ్ఞాన యాత్రలను ఈ బస్సు ద్వారా నిర్వహించడం లేదు. ఆశ్‌విట్‌లోని అహ్లాదకరమైన పర్యాటక ప్రాంతాలను చూపించేందుకే ఈ బస్సును నడుపుతోంది.

ఈ బస్సుపై నాటి జర్మన్ల కిరాతకాలకు బలైన బాధితుల ఫొటోలను చూపించడం పట్ల ఇప్పటికీ బతుకున్న బాధితుల బంధువులు, యూదు నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ఈ బస్సును చెక్ పర్యాటక సంస్థ డిజైన్ చేయించలేదు. చెక్ ఆర్ట్ సినిమా డైరెక్టర్ విట్ క్లుసాక్ తన సినిమా కోసం డిజైన్ చేయించారు. ఆయన ఆశ్‌విట్ పర్యాటక ప్రాంతాలపై ఓ వ్యంగ్య చిత్రాన్ని రూపొందించడం కోసం ఈ బస్సును డిజైన్ చేసి, దానిపై 'కమ్ టు ఆశ్‌విట్, జర్నీ త్రూ ఎమోషన్స్' అనే నినాదాన్ని కూడా రాయించారు. సినిమా అనంతరం క్లుసాక్ ఈ బస్సును ఓ చెక్ పర్యాటక సంస్థకు అమ్మేశారు.

ఆ బస్సుపై బాధితుల స్టిక్కర్లతోపాటు నినాదం కూడా చెక్కుచెదరకుండా ఇప్పటికీ అలాగే ఉంది. తన 13వ ఏట కుటుంబ సభ్యులందరినీ ఆశ్‌విట్ క్యాంప్‌లో కోల్పోయిన ఎరికా బెజిడీకోవ షాక్ తిన్నారు. తక్షణం ఈ స్టిక్కర్లు తొలగించాలని ఆమె బస్సు యజమానిని డిమాండ్ చేస్తున్నారు. బస్సుపై స్టిక్కర్లు రంగులో కలసిపోయాయని, స్టిక్కర్లు తొలగిస్తే రంగు కూడా పోతుందని, బస్సుకు మళ్లీ పెయింటింగ్ వేయించాలంటే 1.30 లక్షల రూపాయలు ఖర్చవుతుందని, అంత డబ్బు తన వద్ద లేదని బస్సు యజమాని వాదిస్తున్నారు. ఎవరైనా లాభాల కోసమే బస్సు నడుపుతారని, తాను కూడా అందుకే నడుపుతున్నానని చెప్పారు. ఈ విషయమై చెక్ పర్యాటక శాఖ ఉన్నతాధికారుల దృష్టికి మీడియా తీసుకెళ్లగా సాధ్యమైనంత త్వరగా బస్సు పెయింటింగ్‌ను మార్పిస్తామని చెప్పారు.

Advertisement
Advertisement