Sakshi News home page

అక్కడ మగవారికి ప్రత్యేక పన్ను!

Published Wed, Aug 9 2017 11:10 AM

Australian cafe charges ‘man tax’ to make a point about inequality



మెల్‌బోర్న్‌: హోటళ్లు, కేఫ్‌లలో ట్యాక్స్‌లు వేయడం చూస్తుంటాం. అయితే ఆడ, మగ తేడాతో ప్రత్యేక పన్నులు వేసే కేఫ్‌ల గురించి మాత్రం ఎరుగం. ఆస్ట్రేలియాలోని ఓ కేఫ్‌ వినూత్నంగా మగవారికి ప్రత్యేక పన్ను వేసి వార్తల్లోకెక్కింది. మెల్‌బోర్న్‌లోని బ్రన్స్‌విక్‌లో ఉన్న ‘హ్యాండ్సమ్‌ హర్‌’అనే కేఫ్‌ ప్రతి నెలలో వారం పాటు మగవారికి 18 శాతం అదనపు పన్ను వేస్తుంది. అయితే దీనిని కట్టాలా? వద్దా అనేది మాత్రం వారి ఇష్టానికే వదిలేస్తుంది. ఇలా వసూలు చేసిన మొత్తాన్ని మహిళలకు సాయం అందించే ఓ చారిటీ సంస్థకు పంపుతోంది. సీట్ల విషయంలో కూడా ఆడవారికి తొలి ప్రాధాన్యం ఇస్తామని కేఫ్‌ యజమాని అలెక్జాండ్రా ఓబ్రిన్‌ చెప్పారు. లింగవివక్షపై అవగాహన పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని ఆమె తెలిపారు.

దీనిపై  నెటిజన్లు సానుకూలంగా స్పందించారు. అవసరమయితే ఎక్కువ ట్యాక్స్‌ చెల్లించాలని కోరారు. తన కుమార్తెలను తీసుకెళ్లడానికి ‘హ్యాండ్సమ్‌ హర్‌’  కేఫ్‌ అనువైన ప్రాంతమని ఓ మహిళ పేర్కొంది. అయితే చాలా కొద్ది మంది మాత్రం ఇది అన్యాయమని సోషల్‌ మీడియాలో కామెంట్లు పెట్టారు. అందరినీ సమానంగా చూడాలని సూచించారు. హ్యాండ్సమ్‌ హర్‌ కేఫ్‌ నిబంధనలు నచ్చకపోతే మరో రెస్టరెంట్‌కు వెళ్లే స్వేచ్ఛ మనకుంది కాబట్టి వీటితో తమకు ఎటువంటి ఇబ్బంది లేదని కొంతమంది పేర్కొన్నారు.

Advertisement
Advertisement