ఆస్ట్రేలియాలో తల్లిదండ్రుల దారుణం | Sakshi
Sakshi News home page

ఇదొక తండ్రి దారుణం.. మాతృత్వానికి మచ్చ

Published Fri, Oct 28 2016 1:30 PM

ఆస్ట్రేలియాలో తల్లిదండ్రుల దారుణం - Sakshi

సిడ్నీ: ఇదొక సభ్య సమాజం తలదించుకునే ఘటన. కంటికి కనిపిస్తే రాళ్లతో కొట్టి చంపాలన్నంత ఆగ్రహం తెప్పించే దుర్మార్గం. కన్నతండ్రి కామాంధుడిగా మారగా అతడికి ఎలా సహకరించాలో చెబుతూ మాతృత్వానికి తీరని మచ్చ తెచ్చిన ఓ పైశాచిక తల్లి దౌర్భాగ్య ప్రవర్తన. అల్లారు ముద్దుగా పెంచుకోవాల్సిన కూతురుకి ఐదేళ్ల ప్రాయం నుంచే నరకం చూపించడం మొదలుపెట్టి ఆస్ట్రేలియాలో ఓ తల్లిదండ్రులు దుర్మార్గానికి పాల్పడ్డారు. పది హేనేళ్లుగా తండ్రి ఆ బిడ్డను చిత్ర హింసలకు గురి చేస్తూ లైంగిక దాడికి పాల్పడగా అలాంటి చర్యను ప్రతిఘటించాల్సిన తల్లి అతడికి సహకరించింది.

కూతురుని ఇష్టమొచ్చినట్లు కొడుతూ అతడికి సహకరించాలంటూ చిత్రవద చేసింది. ఆ బాధిత యువతికి ఇప్పుడు 24 ఏళ్లు. ఎట్టకేలకు ఆ కసాయి తల్లిదండ్రులు జైలు పాలయ్యారు. అతడికి 48 ఏళ్ల జైలు శిక్ష విధించగా ఆమెకు 16 ఏళ్ల జైలు శిక్ష, 11 ఏళ్ల సామాజిక సేవను శిక్షగా విధించారు. వివరాల్లోకి వెళితే, ఆస్ట్రేలియాలో ఓ 59 ఏళ్ల వ్యక్తి, 51 ఏళ్ల మహిళ భార్య భర్తలుగా ఉన్నారు. వారికి ఒక కూతురు ఉంది. ఆ కూతురుకి ఐదేళ్లు వచ్చాక తీసుకెళ్లి వారి ఇంటి ఎదురుగా ఉన్న షెడ్డులో కట్టిపడేశారు. అనంతరం తమ దుశ్చర్యలు మొదలు పెట్టారు. అలా పది హేనేళ్లపాటు ఆమెపై ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు.

ఈ క్రమంలో పదునైన వస్తువులు ఆ బాలిక శరీరంపై గుచ్చుతూ చిత్రవద చేశారు. మిరపకాయలు తినిపించారు. తాము చెప్పినట్లు చేయకుంటే గొంతు తెగకోస్తామంటూ చిన్న సైజు రంపపు బ్లేడుతో గాయాలు చేశారు. ప్రస్తుతం మానసిక వైద్యాలయంలో చికిత్స పొందుతున్న ఆ బాధిత యువతి 2011లో తల్లిదండ్రులపై ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు రెండేళ్లపాటు విచారణ చేసి 2013లో వారిని అరెస్టు చేయగా వారికి శుక్రవారం కోర్టు శిక్షను ఖరారు చేసింది. ఆ తండ్రి 73 నేరాలకు పాల్పడగా ఆమె మొత్తం 13 నేరాలకు పాల్పడినట్లు కోర్టు నిర్దారించింది. వారు చేసిన చర్యలపట్ల సిడ్నీ కోర్టు దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది.

Advertisement
Advertisement