అమెరికా ఫస్టా? ఇండియా ఫస్టా? | Sakshi
Sakshi News home page

అమెరికా ఫస్టా? ఇండియా ఫస్టా?

Published Mon, Jun 26 2017 8:44 PM

అమెరికా ఫస్టా? ఇండియా ఫస్టా? - Sakshi

‘ఇండియా ఫస్ట్’, ‘అమెరికా ఫస్ట్’ అనే రెండు మాటల్లో తమ విధానాలు చెప్పే ఇండియా, అమెరికా నేతలు నరేంద్రమోదీ, డోనాల్డ్‌ ట్రంప్‌ మధ్య సత్సంబంధాలు, సుహృత్భావ చర్చలు సాధ్యమా? అనే అనుమానం వ్యక్తమైన నేపథ్యంలో భారత ప్రధాని అమెరికా పర్యటన సాఫీగా మొదలైంది. రాజధాని వాషింగ్టన్‌లో ప్రవాస భారతీయులు, అమెరికా వ్యాపార దిగ్గజాలతో వేర్వేరుగా జరిగిన సభల్లో ప్రధాని వ్యవహార శైలి ఆకట్టుకునేలా ఉంది. అయితే, కిందటేడాది అధ్యక్ష ఎన్నికలకు నెలముందు రిపబ్లికన్‌ హిందూ కోఎలిషన్‌ పేరుతో భారత సంతతి ప్రముఖుల సమావేశంలో ట్రంప్‌ ప్రసంగం భారతీయులకు సంతృప్తినిచ్చింది.

ట్రంప్‌ పాలనలో మనం అత్యుత్తమ మిత్రులుగా మారబోతున్నాం’’ అన్న ట్రంప్‌ మాటలు ఇంకా ఆచరణలోకి రాలేదు. డెమొక్రాటిక్ అధ్యక్షుడు బరాక్ ఒబామా హయాంలో ఆయనను అమెరికాలో మూడుసార్లు కలిసిన మోదీ మొత్తం ఆరుసార్లు సమావేశమయ్యారు. సంబంధాలు బలోపేతమయ్యాయి. మరి ట్రంప్‌ మాట ప్రకారం గొప్ప మిత్రులుగా కాకపోయినా ఉభయ దేశాలకూ లబ్ధి చేకూర్చేలా అమెరికాతో సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి మోదీ వాషింగ్టన్‌ నగరంలో ప్రారంభించిన ప్రయత్నాలు బాగున్నాయి. 
 
మోదీ మాటలపై అగ్రశ్రేణి బిజినెస్‌ దిగ్గజాల సంతృప్తి
ఒకే రోజు మోదీతో జరిగిన సమావేశాల్లో ప్రవాసీ భారతీయులు, అమెరికా వ్యాపారులు సంతృప్తి ప్రకటించారు. ప్రవాసీలు మోదీ మాటలకు సంతోషం వ్యక్తం చేయడంలో విశేషమేమీ లేదు. విలార్డ్‌ హోటెల్‌లో మరి అగ్రశ్రేణి అమెరికా కంపెనీలు సీఈఓలను మోదీ తన ఉపన్యాసంతో ఆకట్టుకోవడమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. జులై ఒకటి నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చే వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) గురించి మోదీ పదేపదే ప్రస్తావించారు. దీనివల్ల 130 కోట్ల ప్రజలున్న భారత మార్కెట్లో ఒకే విధమైన పన్ను వ్యవస్థ ఏ విధంగా విదేశీ కంపెనీలకు లాభదాయకంగా, సౌకర్యంగా ఉంటుందో వివరించారు.

జీఎస్టీ అనే అతి పెద్ద ఆర్థిక సంస్కరణ దేశంలో మొత్తం ఆర్థిక వాతావరణాన్నే మార్చేస్తుందని ఆయన చెప్పారు. సుందర్‌ పిచాయ్, టిమ్‌కుక్, జెప్‌ బెజోస్‌వంటి బడా కంపెనీల సారథులు మాట్లాడుతున్నప్పుడు వారి ప్రసంగాల్లోని ముఖ్యాంశాలను మోదీ వివరంగా నోట్‌ చేసుకున్నారు. గూగుల్‌ సీఈఓ పిచ్చయ్‌ మాత్రం జీఎస్టీని ఎలా అమలుచేస్తారనే విషయం ఎంతో కీలకమైనదేగాక, అత్యంత కష్టమైందని వ్యాఖ్యానించారు. రిజ్‌ కార్లటన్‌ హోటల్లో 700 మంది భారతీయ ప్రముఖలతో జరిపిన భేటీలో, పేదలకు ఉజ్వల్‌ పథకం కింద వంట గ్యాస్‌ కనెక్షన్లు ఇవ్వడం నుంచి బ్యాంక్‌ ఖాతాలు తెరవడం, రైతులకు వేప నూనె పూసిన యూరియా సరఫరా, పాక్లోని ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడుల గురించి మోదీ ప్రస్తావించారు. 
 
ట్రంప్, మోదీల మధ్య పోలికల కన్నా తేడాలే ఎక్కువ!
ట్రంప్, మోదీల మధ్య ఎన్నో పోలికలున్నాయని మీడియాలో ఎన్నో కథనాలు, వాదనలు వినిపిస్తున్నా తేడాలే ఎక్కువ అనే వాస్తవాన్ని చాలా మంది గుర్తించారు. అయినా సోమవారం మధ్యాహ్నం ఐదు గంటలపాటు జరిగే ఇద్దరి భేటీలో రెండు పెద్ద ప్రజాతంత్ర దేశాల నేతలుగానే వారు వ్యవహరిస్తారనే అంచనా వేస్తున్నారు.

అమెరికాలోని దాదాపు 35లక్షల మంది భారత సంతతి జనంలో 65శాతం డెమొక్రాట్‌ పార్టీ సానుభూతిపరులనే ప్రచారం ఉన్నప్పటికీ రెండు ఆర్థిక వ్యవస్థల పరస్పర ప్రయోజనాల దృష్ట్యా ట్రంప్, మోదీలు ద్వైపాక్షిక సంబంధాల విషయంలో సానుకూల అవగాహనకే వస్తారని భావిస్తున్నారు. హెచ్1బీ వీసా, ఐటీ కంపెనీల ఎగుమతుల విషయంలో రెండు దేశాల మధ్య అననుకూల వాతావరణం ఉన్నప్పటికీ మోదీ మొదటి రోజు ప్రసంగాలను బట్టి చూస్తే భారత్‌తో సంబంధాల విషయంలో ఎక్కువ శ్రద్ధ పెట్టి ముందుకు సాగితే ‘అమెరికా ఫస్ట్’ అనే లక్ష్య సాధనకు అది ఉపకరిస్తుందని ట్రంప్‌ను మోదీ నమ్మించగలిగితే, ఆయన అమెరికా యాత్ర సఫలమైనట్టే. 
 
(సాక్షి నాలెడ్జ్‌ సెంటర్)

Advertisement

తప్పక చదవండి

Advertisement