హెచ్‌4లకు ఉద్యోగాల రద్దు వద్దు!

18 Nov, 2018 04:36 IST|Sakshi

వాషింగ్టన్‌: హెచ్‌ 1 బీ వీసాదారుల జీవిత భాగస్వాములు దేశంలో ఉద్యోగాలు చేసుకునేందుకు అవకాశం కల్పించే నిబంధనను రద్దు చేయొద్దంటూ అమెరికా కాంగ్రెస్‌లో ఇద్దరు సభ్యులు ఒక బిల్లును ప్రవేశపెట్టారు. హెచ్‌1బీ వీసాదారుల జీవిత భాగస్వాములైన హెచ్‌ 4 వీసాదారులు కూడా అమెరికాలో ఉద్యోగాలు చేసుకునే అవకాశాన్ని అధ్యక్షుడిగా ఒబామా ఉన్న సమయంలో కల్పించారు. అప్పటినుంచి లక్షకు పైగా హెచ్‌ 4 వీసాదారులు, వారిలో అధికులు మహిళలే.. అమెరికాలో ఉద్యోగాలు సాధించారు. ట్రంప్‌ అధ్యక్షుడయ్యాక అమెరికన్ల ఉద్యోగ భద్రత కారణంగా చూపుతూ ఈ అవకాశాన్ని రద్దు చేసే దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ ఏడాది చివరలోగా ఆ ప్రతిపాదన కార్యరూపం దాల్చ వచ్చన్న వార్తల నేపథ్యంలో.. అమెరికా కాంగ్రెస్‌లో అనా జీ ఏషూ, జో లాఫ్రెన్‌ ‘హెచ్‌ 4 ఎంప్లాయిమెంట్‌ ప్రొటెక్షన్‌ యాక్ట్‌’ పేరుతో ఈ బిల్లును ప్రవేశపెట్టారు.

హెచ్‌ 4 వీసాదారులకు ఉద్యోగావకాశాలను నిరాకరించడం వల్ల అమెరికా ఆర్థికవ్యవస్థకు నష్టం కలుగుతుందని, భారత్, చైనా తదితర దేశాలకు చెందిన నిపుణులైన విదేశీ ఉద్యోగులు దేశం విడిచి వెళ్లడం కానీ, లేదా మెరుగైన వీసా నిబంధనలున్న మరో దేశానికి వెళ్లడం కానీ జరిగే అవకాశముం దని వారు ఆందోళన వ్యక్తం చేశారు. సాంకేతిక, సైద్ధాంతిక నిపుణులైన విదేశీయులకు అమెరికా లో ఉద్యోగాలు చేసుకునే అవకాశం కల్పించేదే హెచ్‌1 బీ వీసా. భారత్‌ నుంచి వేలాది మంది ఈ వీసాపై అమెరికాలో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. హెచ్‌ 4 వీసాపై అమెరికా వెళ్లిన వారి జీవిత భాగస్వాములు కూడా ఉద్యోగాలు చేయడం వల్ల ఆ కుటుంబాలకు ఆర్థిక స్థిరత్వం ఏర్పడిందని, అది అమెరికా ఆర్థిక వ్యవస్థకూ ఉపయోగపడిందని లాఫ్రెన్‌ పేర్కొన్నారు. హెచ్‌ 4 వీసాదారులకు ఉద్యోగావకాశం కల్పించడం ఆర్థిక సమానత్వానికి, కుటుంబ విలువలకు సంబంధించిన అంశమన్నారు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు