విలాసాల కోసం ఎంతైనా కొనేస్తారు! | Sakshi
Sakshi News home page

విలాసాల కోసం ఎంతైనా కొనేస్తారు!

Published Thu, Jan 14 2016 7:43 PM

విలాసాల కోసం ఎంతైనా కొనేస్తారు!

డబ్బుండాలే గానీ.. కొండ మీద కోతైనా దిగొస్తుందనేది ఒక నానుడి. తమ ఇష్టాలు, విలాసాల కోసం కొంత మంది బిలియనీర్లు గుమ్మరించే మొత్తాలను చూస్తే ఇది నిజమనిపించక మానదు. అనుకున్నదే తడవుగా విమానాల నుంచి ఐలాండ్‌ల వరకు దేన్నైనా కొనేస్తున్నారు. అలా బిలియనీర్లు సొంతం చేసుకున్న కొన్ని ఖరీదైన వస్తువులపై రోజు ఓలుక్కేద్దాం..!
 
విలాసాల విహంగం..

మన దేశంలోని ధనవంతుల జాబితాలో మొదటి స్థానాన్ని ఆక్రమించే ముఖేష్ అంబానీ తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించేందుకు ఎంత కష్టపడతారో తన సరదాలకూ అంతే ప్రాధాన్యం ఇస్తారు. ఆయన భార్యా పిల్లలతో సరదాగా గడిపేందుకు బోయింగ్ బిజినెస్ జెట్-2 విమానాన్ని కొనుగోలు చేశారు. ఇందులో ప్రత్యేకంగా హోటల్‌తో పాటు బోర్డు రూమ్ కూడా ఉంది. వీటిలో కావాల్సిన విధంగా ఎంజాయ్ చేసేందుకు అవసరమైన ఎన్నో సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. 1,004 చదరపు అడుగుల ఈ ప్లేన్‌లో ఆయన కోసం ప్రత్యేకంగా ఎగ్జిక్యూటివ్ ఆఫీస్, ప్రైవేట్ సూట్‌ను ఏర్పాటు చేసుకున్నారు.
 
ఖరీదైన షికారు..
బిలియనీర్ సోదరులలో పెద్దవాడైన ముఖేష్ అంబానీ లాగే అనిల్ అంబానీకి సైతం కొన్ని ఇష్టాలున్నాయి. ఈయనకు స్పీడ్‌గా వెళ్లే కార్లంటే మక్కువ ఎక్కువ. లాంబ్రోగినీ, గల్లార్డో, మెర్సిడీజ్ ఎస్ క్లాస్, మేబ్యాచ్, బిఎండబ్ల్యూ 7 సిరీస్, అడీ క్యూ7, రాల్స్ రాయిస్, లెక్సస్.. వంటి ఎన్నో ఖరీదైన కార్లు ఆయన దగ్గరున్నాయి. ఇంతటి ఖరీదైన కార్లు మన దేశంలో ఇంకెవరి దగ్గరా లేవంటే అతిశయోక్తి కాదు.
 
ద్వీపాన్నే కొనేశాడు..
విదేశాల్లో నివసిస్తున్న ఎన్‌ఆర్‌ఐ బిలియనీర్లలో ఒకరు బాబ్ దిల్లాన్. కెనడాలో ఉండే ఈ ఇండియన్ అమెరికాలోని బెలీజ్ ప్రాంతం సమీపంలో ఏకంగా 2,300 ఎకరాల ద్వీపాన్ని కొనుగోలు చేశారు. సెంట్రల్ అమెరికన్ ఐలాండ్ అయిన దీన్ని ఎంతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. పచ్చటి ప్రకృతితో కళకళలాడే ఈ ద్వీపంలోనే తన నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ ఐలాండ్ పొరుగునే హాలీవుడ్ స్టార్ లియోనార్డో డి కాప్రియో ద్వీపం కూడా ఉండటం విశేషం.
 
బోటు కోసం కోట్లు..
 విలాసాలకు మారు పేరుగా ఫేమస్ అయిన వ్యక్తి లిక్కర్ కింగ్ విజయ్‌మాల్యా. ఈయనకు విలాసవంతమైన బోట్లంటే ప్రాణం. అందుకే 450 కోట్ల రూపాయలు పెట్టి ఒక బోట్ కొనుగోలు చేశారు. 95 మీటర్ల వైశాల్యం ఉన్న ఈ బోటుకు ‘ఇండియన్ ఎంప్రెస్’ అని నామకరణం చేశారు. మసాజ్, సోనా రూమ్‌లను ఇందులో ఏర్పాటు చేశారు.
 
సన్నీ దీవాన్ కూడా..
రియల్ ఎస్టేట్ మొఘల్‌గా పేరుగాంచిన సన్నీ దీవాన్ దేశంలోని టాప్ బిలియనీర్లలో ఒకరు. ఈ బిలియనీర్ రూ. 527 కోట్లు పెట్టి ఒక ఫెర్రెట్టీ 881 బోట్‌ను కొన్నారు. అత్యాధునిక సాంకేతికత పరిజ్ఞానం ఉన్న ఈ బోటు సముద్రంలో వేగంగా దూసుకుపోతుంది. దీన్ని తరచుగా గేట్ వే ఆఫ్ ఇండియా వద్ద పార్క్ చేస్తుంటారు.
 
 వీరిదీ అదేదారి..
    మైక్రోసాఫ్ట్  అధినేత బిల్‌గేట్స్ తన గారాల కూతురు కోసం 8.7 మిలియన్ డాలర్లు వెచ్చించి ఫ్లోరిడాలోని 4.8 ఎకరాల విస్తీర్ణమున్న వెకేషన్ ప్యాడ్‌ను కొనుగోలు చేశారు.
     ఒరాకిల్ సంస్థల సహ వ్యవస్థాపకులైన లారీ ఎల్లిసన్‌కు ఎన్నో విలువైన అస్తులు ఉన్నాయి. వాటిలో పోర్క్‌పైన్ క్రీక్ ఒకటి. దీని విలువ అక్షరాలా 43 మిలియన్ డాలర్లు.
     గూగుల్ బాస్ ఎరిక్ స్కిమిడ్ 2007లో 20 మిలియన్ డాలర్లతో ఒక పాత ఇంటిని కొనుగోలు చేశారు.
     అమెజాన్ డాట్ కామ్ ఓనర్ జెఫ్ బిజోస్‌కు బెవర్లీ హిల్స్‌లో ఉన్న నివాసం ఖరీదు 25 మిలియన్ డాలర్లు. ఈ ఇంటికి పొరుగున ఉన్న నివాసం ప్రముఖ హాలీవుడ్ నటుడు టామ్ క్రూజీది.

Advertisement
Advertisement