తప్పించుకో చూద్దాం! | Sakshi
Sakshi News home page

తప్పించుకో చూద్దాం!

Published Thu, Oct 1 2015 5:01 PM

తప్పించుకో చూద్దాం!

లండన్: ‘నీవు ఏ ప్రాంతమెల్లినా ఎందుదాగుండినా ప్రభుత్వ నిఘా నేత్రం నిన్ను వెన్నంటే ఉంటుంది’ అన్న విషయాన్ని అక్షరాల నిరూపించేందుకు బ్రిటన్‌కు చెందిన ఛానెల్ 4 టీవీ ఓ వినూత్న రియాలిటీ షో నిర్వహించి నిరూపించింది. అందుకోసం 14 మంది సామాన్యులను ఎంపిక చేసింది. లండన్‌లో టెర్రరిస్టు నిరోధక విభాగం మాజీ అధిపతి, సీఐఏ విశ్లేషకుడు, నిఘా నిపుణులతో కూడిన 30 మందిని ఓ బృందంగా ఏర్పాటు చేసింది.

14 మంది సామాన్యులు నిఘా బృందానికి దొరక్కుండా దేశంలో ఎక్కడికైనా పారిపోతుండాలి.  దొరక్కుండా ఉండేందుకు హోటళ్లలో బస చేయకూడదు. క్రెడిట్ కార్డులు ఉపయోగించకూడదు. సెల్‌ఫోన్లు వినియోగించరాదు. ఇలా వీలైనన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. 28 రోజులపాటు దొరక్కుండా తప్పించుకు తిరిగిన సామాన్యుడిని రియాలిటీ షోలో విజేతగా ప్రకటిస్తారు. నిఘా నిపుణుల బృందం పరారీలోవున్న సామాన్యులను ఎక్కడున్నా వెతికి పట్టుకోవాలి. స్థూలంగా ఇది ‘హైడ్ అండ్ సీక్’ లాంటి గేమ్.

ఓ రోజు గేమ్ ప్రారంభమైంది. షో నిర్వాహకులు దారి ఖర్చులకు ఇచ్చిన డబ్బులను తీసుకొని, భుజానికి బ్యాగులు తగిలించుకొని 14 మంది సామాన్యులు దేశంలో తలో దిక్కుకు పారిపోయారు. వారిని పట్టుకునేందుకు నిఘా బృందం వెంట పడింది. రెండు వారాల్లోనే 13 మంది సామాన్యులు దొరికిపోయారు. ఆఖరి వాడు 46 ఏళ్ల జీపీ రికీ అలెన్ గత వారం దొరికి పోయారు.

కార్ల నెంబర్ ప్లేట్లను ఆటోమేటిక్‌గా గుర్తించే సీసీటీవీ ఫుటేజ్‌ల ద్వారా లండన్‌లోని యూస్టన్ రైల్వే స్టేషన్లో రికీని పట్టుకోగలిగారు. 28 రోజుల పాటు ఆయన తప్పించుకోలేక పోయినా షో నిర్వాహకులు ఆయన్నే విజేతగా ప్రకటించి బహమతి ప్రకటించారు. బ్రిటన్‌లో ప్రతి 11 మందికి ఒకటి చొప్పున సీసీటీవీ కెమెరాలు వీధుల్లో అమర్చి ఉన్నాయి. వాటిలో నంబరు ప్లేట్లను ఆటోమేటిక్‌గా గుర్తించే కెమెరాలు ఎనిమిది వేలున్నాయి.

రోజుకు 140 లక్షల మంది డ్రైవర్లపై అవి నిఘా వేయగలవు. మూడున్నర కోట్ల మంది ప్రజల సెలఫోన్లను ట్రాక్ చేయగల జీపీఎస్ వ్యవస్థ కూడా పోలీసు అధికార వ్యవస్థ ఉంది. ఆ అధికార వ్యవస్థను ఉపయోగించుకునే అవకాశం ఓ టీవీ ఛానల్‌కు ఉండదుకనుక, మ్యాపింగ్ ద్వారా ప్రభుత్వ నిఘా కెమెరాలు ఎక్కడున్నాయో అక్కడ షో నిర్వాహకులు ప్రైవేటు సీసీటీవీ కెమెరాలను అమర్చి పరారీలో ఉన్న సామాన్యులపై నిఘా పెట్టారు. అందులో ఓ నెంబర్ ప్లేటును గుర్తించే కెమెరా ఫుటేజ్ ద్వారా రికీని నిఘా బృందం పట్టుకోగలిగింది. ఆయన ఓ కారు పక్కన నిలబడి ఉండడాన్ని గమనించిన బృందం ఆ కారును వెంటాడడం ద్వారా రికీని దొరకబుచ్చుకుంది.

పలుసార్లు తనను పట్టుకునేందుకు నిఘా బృందం తనకు సమీపంలోకి వచ్చినప్పటికీ వారిని తప్పుదోవ పట్టించడం ద్వారా ఎక్కువ రోజులు దొరక్కుండా తప్పించున్నానని రికీ తెలిపారు. జాన్ బుచన్ 1915లో రాసిన ‘ది 39 స్టెప్స్’ అడ్వెంచర్ నవల తనకెంతో స్ఫూర్తినిచ్చిందని, దానిలో పేర్కొన్న ప్రాంతాలన్నింటికి తాను తప్పించుకొని పారిపోవడంలో భాగంగా వెళ్లానని రికీ వివరించారు. తన ఇంట్లోనే ఉన్న ఆ నవలను స్వాధీనం చేసుకొని, దాన్ని చదివి ఉన్నట్లయితే  నిఘా బృందం తనను ఎప్పుడో పట్టుకొని ఉండేదని రికీ వివరించారు.

నిఘా నీడల మధ్య జీవితం ఎలా ఉంటుందో తన పిల్లలకు చెప్పడం కోసమే తానీ రియాలిటీ గేమ్ షోలో పాల్గొన్నానని చెప్పారు. నేటి సాంకేతిక యుగంలో ‘దాచుకోవాల్సింది ఏమీ లేనప్పుడు దేనికి భయపడాల్సిన అవసరం లేదనే నానుడిని నీవు ఏ తప్పు చేయనప్పుడు నీ ఇంట్లో నిఘా కెమెరా పెడతేనేమి’గా మార్చాలని ఆయన వ్యాఖ్యానించారు.

Advertisement
Advertisement