Sakshi News home page

ఒక్కో భవనం.. నిలువెత్తు అడవి

Published Fri, May 5 2017 10:10 AM

ఒక్కో భవనం.. నిలువెత్తు అడవి

బీజింగ్‌: రోజురోజుకు పెగిరిపోతున్న కాలుష్యంపై చైనా వినూత్న విధానాన్ని తెరపైకి తెచ్చింది. ఆకాశహర్మ్యాలను(పెద్ద భవంతులను) నిలువెత్తు అడవులుగా మార్చే ప్రయత్నాన్ని మొదలుపెట్టి ఇతరదేశాలకు మార్గదర్శకంగా నిలుస్తోంది. అసలే జనాభాలో తొలిస్థానం.. అలాంటప్పుడూ అన్ని రకాల కాలుష్యాలలోనూ ఇతర దేశాలతో చైనా పోటీపడుతున్నట్లుగా మారింది పరిస్థితి. దీంతో ఇటలీకి చెందిన ఆర్కిటెక్ట్‌ స్టెఫానో బోయెరీ బృందంతో చర్చలు జరిపి చైనా అధికారులు వర్టికల్‌ ఫారెస్ట్‌ (నిలువెత్తు అడవి) లను అభివృద్ధి చేస్తున్నారు.

తూర్పు చైనాలోని నాన్‌ జింగ్‌ నగరం ఇప్పుడిప్పుడే కాలుష్యం కోరల నుంచి బయటపడుతుంది. ఇందుకు కారణం వర్టికల్‌ ఫారెస్ట్‌. తొలుత 110, 76 మీటర్లు ఎత్తున్న రెండు భవనాలను ప్రాజెక్టుగా తీసుకున్నారు. కేవలం ఈ రెండు నిర్మాణాలలో 900 చెట్లతో పాటు దాదాపు 20,000 మొక్కలను పెంచటం సాధ్యం చేసి చూపించారు. ఈ చెట్లు, మొక్కలు ప్రతిరోజూ దాదాపు వంద కేజీల కార్బన్‌ డై ఆక్సైడ్‌ ను గ్రహించి, 60 కేజీల వరకు ఆక్సిజన్‌ ను విడుదల చేస్తాయని భావిస్తున్నారు. 25 టన్నుల కార్బన్‌ డై ఆక్సైడ్‌ ను తగ్గించడమంటే 5 కార్లను ఏడాది పాటు తిప్పడం ఆపేసినట్లు అవుతుందట.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 54 శాతం ప్రజలు పట్టణ ప్రాంతాల్లో నివసిస్తూ కాలుష్యం కోరల్లో చిక్కుకుంటున్నారు. 2050 నాటికి అర్బన్‌ ఏరియాలలో 66శాతం జనాభా ఉండనుందని.. ఆఫ్రికా, ఆసియా దేశాలలోనే పెరుగుదల కనిపిస్తుందని సర్వేలలో తేలింది. అయితే అడవుల నరికివేతను అరికట్టడంతో పాటు జనావాసాలలో చెట్లను భారీగా పెంచటం మొదలుపెడితే వాయుకాలుష్యాన్ని అరికట్టవచ్చు. వర్టికల్‌ ఫారెస్ట్‌ లు స్వచ్ఛమైన గాలిని అందిస్తాయని, దీంతో ఆరోగ్య సమస్యలు తగ్గుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.

గత డిసెంబర్‌ లో చైనాలోని 24 నగరాలకు కాలుష్య ముప్పు తప్పదని రెడ్‌ అలర్ట్‌ రావడంలో ఆలోచించి వర్టికల్‌ ఫారెస్ట్‌ ప్రాజెక్టు మొదలుపెట్టారు. చైనాలో కాలుష్య నగరాలలో షాజియాహువాంగ్‌ ఒకటి. ఈ సిటీలోనూ ఆర్కిటెక్ట్‌ స్టెఫానో బోయెరీ పలు సంస్కరణలు తీసుకొస్తున్నాడు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా తన బృందంతో కలిసి వర్టికల్‌ ఫారెస్ట్‌ లను డిజైన్‌ చేశాడు. కొన్ని నెలల్లోనే ఈ సిటీలో కాలుష్యాన్ని సగంమేరకు తగ్గించే పనిలో నిమగ్నమయ్యాడు. మరో రెండు వర్టికల్‌ ప్రాజెక్టులను నాన్‌ జింగ్‌ లో మొదలుపెట్టారు. 200 మీటర్లు, 108 మీటర్ల ఎత్తయిన భవంతులపై చెట్లు, మొక్కల పెంపకం ప్రాజెక్టును 2018లో పూర్తిచేయాలని ప్లాన్‌ చేశారు.

ఆస్ట్రేలియాలోని సిడ్నీలో కూడా వర్టికల్‌ ఫారెస్ట్‌ ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయి. ఇందుకుగానూ సింగపూర్‌ నుంచి సూపర్‌ ట్రీస్‌ ను విరివిగా దిగుతుగా చేసుకుంటున్నారు. సిడ్నీలోని వన్‌ సెంట్రల్‌ పార్కులో కొన్ని వర్టికల్‌ ఫారెస్ట్‌ లు దర్శనమిస్తుంటాయి. ప్రపంచవ్యాప్తంగా వర్టికల్‌ ఫారెస్ట్‌ లు ప్రారంభించి ఫారెస్ట్‌ సిటీలు ఏర్పడాలని పర్యావరణవేత్తలు ఆశిస్తున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement