విడిచిపెడితే విధ్వంసమే... ! | Sakshi
Sakshi News home page

Published Fri, Jan 4 2019 9:31 PM

China Unveils Its Own Mother Of All Bombs - Sakshi

బీజింగ్‌: పొరుగుదేశమైన చైనా పెను విధ్వంసం సృష్టించే బాంబును అభివృద్ధి చేసింది. ఇది అమెరికా ఇప్పటికే తయారుచేసిన మదర్‌ ఆఫ్‌ ఆల్‌ బాంబ్స్‌ కంటే శక్తిమంతమైనది గమనార్హం. ఈ బాంబు అత్యంత శక్తిమంతమైనదని డ్రాగన్‌ అధికారిక మీడియా శుక్రవారం పేర్కొంది. ఈ అణుఇంధనేతర బాంబును చైనా రక్షణ ఉత్పత్తుల్లో అగ్రగామి సంస్థ అయిన నొరిన్‌కో తొలిసారిగా ప్రదర్శించింది. దీనిని చైనీస్‌ వర్షన్‌ ఆఫ్‌ మదర్‌ బాంబ్‌గా అధికార గ్లోబల్‌ టైమ్స్‌ పత్రిక తన సంపాదకీయంలో పేర్కొంది. ఇది నిమిషాల వ్యవధిలో సర్వం నాశనం చేయగల సామర్థ్యం దీని సొంతం.

అణ్వాయుధాల తర్వాతి స్థానం దీనికే దక్కుతుంది. హెచ్‌–6కే బాంబర్‌ సహాయంతో దీనిని గగనతలం నుంచి ప్రయోగాత్మకంగా విడిచిపెట్టారు. దీంతో అది భారీ విధ్వంసం సృష్టించింది. ఇందుకు సంబంధించిన ప్రమోషనల్‌ వీడియోని నొరిన్‌కో మీడియాకు విడుదల చేసింది. గత నెలలో ఈ బాంబును పరీక్షించినట్టు నొరిన్‌కో తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. బాంబు సృష్టించిన విధ్వంసం తాలూకు దృశ్యాలను బహిరంగం చేయడం మాత్రం ఇదే తొలిసారని చైనా అధికార వార్తాసంస్థ జిన్హువా తెలిపింది.  

ఉగ్రవాదులపై ప్రయోగించిన అమెరికా
మాసివ్‌ ఆర్డినెన్స్‌ ఎయిర్‌ బ్లాస్ట్‌ (ఎంఓఏబీ) ఆయుధంగా పిలుచుకునే జీబీయూ–43 బీ బాంబుతో అమెరికా సైన్యం గత సంవత్సరం అఫ్ఘనిస్థాన్‌లోని ఉగ్రవాదుల స్థావరాలను సమూలంగా నాశనం చేసింది. అఫ్ఘనిస్థాన్‌లో కొన్నేళ్లుగా ఉగ్రవాద కార్యకలాపాల అంతమే లక్ష్యంగా అమెరికా ముందుకు సాగుతుండడం తెలిసిందే. ఇది మదర్‌ ఆఫ్‌ ఆల్‌ బాంబ్స్‌ అని అందరికీ తెలిసిన విషయమే. చైనా కూడా అదే ముద్దుపేరును తన బాంబుకు వాడుకుంటోంది.

ఈ బాంబు అనేక టన్నుల బరువు ఉంటుందని, అమెరికా వద్ద ఉన్న బాంబుతో పోలిస్తే చైనా తయారుచేసిన బాంబు చిన్నదిగానే, తేలికగాను ఉంటుంది. ఇది ఐదు నుంచి ఆరు మీటర్ల పొడవు ఉంటుంది. ఎంత అధునాతనంగా నిర్మించిన కోటలుగాని, భూఉపరితల లక్ష్యాలనుగానీ, రక్షణ స్థావరాలనుగానీ ఈ బాంబు సమూలంగా తుడిచిపెడుతుంది. అయితే అమెరికా తయారుచేసిన బాంబు చైనా బాంబు కంటే పెద్దది కావడంతో దానిని తరలించడానికి భారీ రవాణా విమానాలే తప్ప మరో మార్గం లేదు. హెచ్‌–6కే జెట్‌ విమానాలు మాత్రమే దీనిని ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించగలుగుతాయి.  

ఫాదర్‌ ఆఫ్‌ ఆల్‌ బాంబ్స్‌  
మరోవైపు అమెరికా దాడులకు పాల్పడితే ధీటుగా తిప్పికొట్టేందుకు రష్యా కూడా మరో భారీ బాంబును తయారుచేసింది. దీనిని అది ఫాదర్‌ ఆఫ్‌ ఆల్‌ బాంబ్స్‌ అని ముద్దుగా పిలుచుకుంటోంది. ఇది చైనా, అమెరికా బాంబుల కంటే ఇంకా పెద్దగా ఉంటుంది.

Advertisement
Advertisement