Sakshi News home page

పెళ్లయిన 48 గంటలకే...

Published Tue, May 23 2017 6:50 PM

పెళ్లయిన 48 గంటలకే...

మాంచెస్టర్‌: ఇంగ్లాండ్, గ్రేటర్‌ మాంచెస్టర్‌లోని రోచ్‌డలే నగరానికి చెందిన 63 ఏళ్ల రే కెర్షా, 45 ఏళ్ల ట్రేసీ బుక్స్‌ గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వచ్చే ఏడాది పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. అకస్మాత్తుగా జబ్బు పడిన రే కెర్షాకు ప్రాణాంతకమైన క్యాన్సర్‌ వచ్చిందని వైద్యులు ధ్రువీకరించారు. దాంతో వారు పెళ్లిని ముందుకు జరుపుకుని వచ్చే జూన్‌ నెలలో పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అంత సమయం లేదని, కొన్ని రోజుల్లోనే కెర్షా మరణిస్తారని వైద్యులు చెప్పడంతో పెళ్లిని మరింత ముందుకు జరుపుకున్నారు. శనివారం పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అయితే పెళ్లి చేసుకోవడానికి వారి వద్ద డబ్బులు మిగల్లేదు. ఉన్నంత డబ్బంతా క్యాన్సర్‌ జబ్బుకే ఖర్చు పెట్టారు.

ఈ దశలో ట్రేసీ బుక్స్‌ స్థానిక చారిటీ సంస్థ ‘గిఫ్ట్‌ ఆఫ్‌ ఏ వెడ్డింగ్‌’ను సంప్రదించింది. వీరి పెళ్లి చేయడానికి ఆ సంస్థ ముందుకు వచ్చి పెళ్లికి కావాల్సిన సరకులు లేదా నగదు రూపంలో విరాళాల కోసం స్ధానిక ప్రజలకు పిలుపునిచ్చింది. రెండు రోజుల్లోనే అవసరమైనంత మేరకు విరాళాలు రావడంతో శనివారం సాయంత్రం కెర్షా చికిత్స పొందుతున్న ఆస్పత్రిలోనే వారిద్దరికి పెళ్లి చేసింది. పెళ్లికి అతిథిలుగా విచ్చేసిన బంధు, మిత్రులు, నర్సింగ్‌ సిబ్బంది, స్థానిక ప్రజలకు ఏ లోటు రాకుండా విందు భోజనాలు కూడా ఏర్పాటు చేశారు.

ఈ పెళ్లికి సహాయ, సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపిన ‘గిఫ్ట్‌ ఆఫ్‌ ఏ వెడ్డింగ్‌’  సంస్థ కెర్షా పెళ్లయిన 48 గంటలకు, అంటే మంగళవారం మరణించారని తెలియజేయడానికి తీవ్రంగా విచారిస్తున్నామని తెలిపింది. పెళ్లికి హాజరైన బంధువులు, మిత్రులు అందరూ ఈ వార్తను షేర్‌ చేసుకొని పెళ్లి కూతురు ట్రేసీకి తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఇంకా కొన్ని రోజులైనా కెర్షా బతికుంటే బాగుండేదని వారు వ్యాఖ్యానించారు. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు ఏం ఉద్యోగాలు చేసేవారు? ఆ వయస్సులో వారికి పెళ్లి ఎందుకు అవసరమైందీ? వారి మధ్య ప్రేమ ఎలా పుట్టింది? అన్న వివరాలను మాత్రం వారెవరూ తమ ఫేస్‌బుక్‌ పేజీల్లో వివరించలేదు.

Advertisement
Advertisement