దేవుడి ఫోన్‌ నంబర్‌ కావాలా? | Sakshi
Sakshi News home page

దేవుడి ఫోన్‌ నంబర్‌ కావాలా?

Published Sun, May 21 2017 1:53 AM

దేవుడి ఫోన్‌ నంబర్‌ కావాలా?

పాల్‌ శాన్యన్‌గోర్‌.. జింబాబ్వేలో ఈయనొక ప్రముఖ పాస్టర్‌. ఈ పాస్టర్‌కు ఒక ప్రత్యేకత ఉంది. ఇతని దగ్గర దేవుని ఫోన్‌ నంబర్‌ ఉందంట! రోజూ ఆ నంబర్‌కు కాల్‌ చేసి దేవుడితో ఎంచక్కా తన సమస్యలు చెప్పుకుంటాడంట! అంతేకాదండోయ్‌ దేవుడు కూడా తనకు కాల్‌ చేస్తుంటాడని చెబుతుంటాడు. పాల్‌ను అక్కడ అందరూ ముద్దుగా ‘పాస్టర్‌ టాలెంట్‌’ అని పిలుస్తుంటారు. ‘నా దగ్గర దేవుని ఫోన్‌ నంబర్‌ ఉంది. నాకు అవసరమైనప్పుడు కాల్‌ చేస్తుంటా! దేవునితో ఎవరైనా మాట్లాడొచ్చు. ఇందులో అనుమానం ఎందుకు? నేను ఏమి చేయాలో నేరుగా దేవుడు నాకు కాల్‌ చేసి చెప్తాడు.

నేనొకసారి దేవునికి ప్రార్థన చేస్తున్న సమయంలో నాకు డైరెక్టుగా కాల్‌ చేయమని ఒక సన్నని స్వరము వినపడింది. దేవుడు బైబిల్‌లో అబ్రహాంతో మాట్లాడినప్పుడు మనతో ఎందుకు మాట్లాడడు’ అని పాల్‌ ప్రశ్నిస్తున్నాడు. అంతేకాదండోయ్‌ విక్టరీ అనే చర్చి టీవీ చానల్‌లో ‘హెవెన్‌ ఆన్‌లైన్‌’ అనే కొత్త కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు చెప్పాడు. ఆ కార్యక్రమంలో అనేక మంది నేరుగా దేవునితో మాట్లాడే అవకాశాన్ని కల్పిస్తానని చెప్పాడు. దీంతోపాటు విక్టరీ మినిస్ట్రీస్‌ వారు నిర్వహించే ప్రత్యేక కూడికల్లో దేవుని ఫోన్‌ నంబర్‌ను వెల్లడిస్తానని పాల్‌ తెలిపాడు. కానీ ఇప్పటివరకు దేవుని ఫోన్‌ నంబర్‌ మాత్రం వెల్లడించలేదు.

అంతమాత్రనా పాల్‌ అబద్ధం చెప్పినట్లు కాదండోయ్‌.. దేవుని నంబర్‌ను వెల్లడిపరిచేందుకు ఇది సరైన సమయం కాదని భావిస్తున్నాడంట.. ఈ నెల ప్రారంభంలో ఒక మీడియా చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ నెలాఖరుకల్లా అనగా ఈ వచ్చే ఆదివారం కచ్చితంగా దేవుని ఫోన్‌ నంబర్‌ ప్రజలకు తప్పకుండా తెలియపరుస్తానని చెప్పాడు. చూద్దాం.. మనం కూడా దేవుని ఫోన్‌ నంబర్‌ ఏంటో తెలుసుకుందాం!

Advertisement
Advertisement