ఏడుగురుని రక్షించి తాను... | Sakshi
Sakshi News home page

ఏడుగురుని రక్షించి తాను...

Published Tue, Apr 26 2016 4:39 PM

ఏడుగురుని రక్షించి తాను...

ఈక్వెడార్:
గత వారం ఈక్వెడార్ లో సంభవించిన భూకంపం కారణంగా వందలాది మంది ప్రాణాలు కోల్పోగా, శిథిలాల్లో చిక్కుకుని కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఏడుగురిని ఓ కుక్క రక్షించింది. శిథిలాల్లో చిక్కుకున్న వారిని అన్వేషించే పనిలో నిరంతరం శ్రమించిన ఆ కుక్క చివరకు ముందుకు నడిచే సత్తువ లేక ప్రాణాలు కోల్పోయింది. తనలో శక్తి కోల్పోతున్నా శిథిలాల్లో చిక్కున్న వారిని రక్షించాలన్న తపనలో నిరంతరం భవనాల శిథిలాల్లోని చిన్నచిన్న సందులు గొందుల్లోంచి ఎంతో శ్రమించి ఏడుగురు ప్రాణాలను కాపాడి చివరకు ఆ కుక్క ప్రాణాలు విడవడం అందరినీ కలచివేసింది.

లాబ్రెడార్ జాతికి చెందిన నాలుగేళ్ల ఆ శునకం పేరు డేకో. ఈక్వెడార్ లోని ఇబారా ఫైర్ సర్వీసెస్ లో గత మూడేళ్లుగా దాని సేవలను వినియోగించుకుంటున్నారు. గతవారం రిక్టర్ స్కేల్ పై 7.8 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపం ఈక్వెడార్‌ను అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 16న సంభవించిన ఈ భూకంపంలో 654 మంది మృత్యువాత పడగా, 2 వేలకు పైగా గాయాలపాలయ్యారు. పెద్ద ఎత్తున ఆస్తులు ధ్వంసమయ్యాయి.

రెస్క్యూ ఆపరేషన్స్ లో భాగంగా ఇబారా ఫైర్ సర్వీసెస్ వారు శిథిలాల కింద చిక్కుకుని కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న వారి కోసం శిథిలాలను తొలగిస్తూ అన్వేషించే పనులు మొదలుపెట్టారు. ఈ క్రమంలో డేకో కూడా తన విధుల్లో భాగంగా శిధిలాల కింద కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న వారిని గుర్తించడానికి క్షణం తీరిక లేకుండా ఉరుకులు పరుగులమీద నిరంతరం పనిచేసింది. శిథిలమైన భవనాల అడుగుభాగాల్లో చిక్కుకున్న ఏడుగురిని గుర్తించింది. దీంతో సిబ్బంది హుటాహుటిన శిథిలాలను తొలగించి వారిని రక్షించగలిగారు. ఒకవైపు తనలో సత్తువ కోల్పోతున్నా డేకో నిరంతర అన్వేషణ కొనసాగించింది. ఈ తరుణంలో డైకోకు తీవ్రమైన శ్వాసకోశ సమస్యలు ఎదురయ్యాయి. దాంతో గుండెపోటు వచ్చి శ్వాస విడిచిందని ఫైర్ సర్వీసెస్ సిబ్బంది తెలిపారు. డేకో అందించిన సేవలు మరవరానివి. డేకో గుర్తించిన కారణంగా ఏడుగురి ప్రాణాలను రక్షించాం. మా యూనిట్ కు ఉన్నతమైన  గుర్తింపు తెచ్చిన డేకో చిరస్మరణీయురాలని నివాళులర్పిస్తూ ఇబారా ఫైర్ సర్వీసెస్ వారు డేకో ఫోటోను తన ఫేస్ బుక్ లో పోస్టు చేశారు.


 

Advertisement
Advertisement