శునకాలు, మనుషులది ఒకే తీరు..! | Sakshi
Sakshi News home page

శునకాలు, మనుషులది ఒకే తీరు..!

Published Tue, Nov 25 2014 12:51 AM

శునకాలు, మనుషులది ఒకే తీరు..! - Sakshi

ఎందులో అనేగా మీ సందేహం? ధ్వనులను విశ్లేషించడంలో అట. ధ్వనులను విశ్లేషించి వాటికి స్పందించే తీరు కుక్కల్లో కూడా మనుషుల మాదిరిగానే ఉంటుందని హంగేరీ శాస్త్రవేత్తలు వెల్లడించారు. పరిసరాల్లోని శబ్దాలకు శునకాలు ఎలా స్పందిస్తున్నాయి? వాటి మెదళ్లలో ఏయే శబ్దాలకు ఎలాంటి స్పందనలు కలుగుతున్నాయి? అన్న కోణంలో వారు పరిశోధించారు. తొలుత 11 కుక్కలకు శిక్షణ ఇచ్చిన తర్వాత వాటి మెద ళ్లను ఎంఆర్‌ఐ స్కానింగ్ చేశారు.

స్కానింగ్ చేసేటప్పుడు కుక్కలు, మనుషుల అరుపులను, శబ్దాలను వినిపించారు. తర్వాత ఏయే శబ్దానికి ఎలాంటి స్పందనలు కలిగాయో  పరిశీలించారు. దీంతో శునకాల్లో కూడా మనుషుల్లో మాదిరిగానే మెదడులోని ‘ప్రైమరీ ఆడిటరీ కార్టెక్స్’ భాగం స్పందిస్తోందని గుర్తించారు. అయితే, మనుషులు తోటి మనుషుల శబ్దాలకు ఎక్కువగా స్పందిస్తుండగా, కుక్కలు కూడా మనుషుల శబ్దాల కన్నా కుక్కల శబ్దాలకే ఎక్కువగా స్పందిస్తున్నాయట.

శబ్దాలను విశ్లేషించి, స్పందించే గుణం ఒకే తీరులో ఉండటం వల్లే శునకాలు మనకు నేస్తాలుగా మారి ఉండొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ పరిశోధనల వల్ల మన మాటలకు కుక్కలు ఎలా స్పందిస్తాయి? వాటిని మచ్చిక చేసుకోవడం ఎలా? అన్నది సులభంగా తెలుసుకోవచ్చని అంటున్నారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement