కాల్‌ సెంటర్ల పై ట్రంప్‌ కన్ను | Sakshi
Sakshi News home page

కాల్‌ సెంటర్ల పై ట్రంప్‌ కన్ను

Published Sun, Mar 5 2017 2:39 AM

కాల్‌ సెంటర్ల పై ట్రంప్‌ కన్ను - Sakshi

కఠినమైన ఆంక్షలతో బిల్లు తెచ్చిన అమెరికా సర్కారు

ఉద్యోగాలు విదేశాలకు తరలిపోకుండా కట్టడి
విదేశాల్లో సెంటర్లు పెడితే కంపెనీలకు గ్రాంట్లు కట్‌
రుణాలూ ఇవ్వకుండా నిబంధనలు
అమెరికా కాంగ్రెస్‌లో బిల్లు
ఆందోళనలో లక్షలాది మంది భారత కాల్‌సెంటర్‌ ఉద్యోగులు


హెచ్‌–1బీ వీసాల తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కన్ను.. ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాలపై పడింది! తక్కువ విద్యార్హతలతో అమెరికా యువతకు పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు కల్పించగల కాల్‌ సెంటర్లపై గురిపెట్టారు. తద్వారా ‘మన ఉద్యోగాలు మనకే..’ అని ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ అమలు దిశగా ముందుకెళ్తున్నారు. కాల్‌ సెంటర్‌ ఉద్యోగాలు అమెరికా నుంచి తరలివెళ్లకుండా ఉండేందుకు కఠిన ఆంక్షలు ప్రతిపాదిస్తూ బిల్లును తెచ్చారు. హెచ్‌1–బీ వీసాపై వచ్చే ఉద్యోగుల కనీస వేతనం 1.3 లక్షల డాలర్లు ఉండాలనే బిల్లును ఇదివరకే తీసుకొచ్చిన విషయం తెలిసిందే.
– సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

నాస్కామ్‌ అంచనా ప్రకారం 2015లో భారత్‌ ఐటీ ఎగు మతులు 100 బిలియన్‌ డాల ర్లు. వీటిలో అమెరికా వాటా 60 శాతం. అంటే.. 60 బిలియన్‌ డాలర్లు. ఐటీ ఆదాయంలో బీపీఓల వాటా 5.11 శాతం ఉంది. అంటే మూడు బిలియన్‌ డాలర్ల పైచిలుకే. రూ పాయల్లో చెప్పాలంటే ఇది 20,019 కోట్లు. అమెరికా నుంచి ఏడాదికి రూ.20 వేల కోట్లు ఆర్జించి పెడు తున్న కాల్‌ సెంటర్లు ఇకపై ఈ వ్యాపా రంపై ఆశలు వదులుకోవాల్సిందే! ఇక ఉ ద్యోగాల విషయానికి వచ్చేసరికి ప్రస్తు తం భారత్‌లో 3.3 లక్షల ఉద్యోగాలను కాల్‌ సెంటర్‌ రంగం కల్పిస్తోంది. వీటిలో మూడింట రెండొంతుల ఉద్యోగాలు అమెరికా వినియోగదారులకు సేవలందిస్తున్న కాల్‌ సెంటర్లు కల్పిస్తున్నవే. అంటే రాబోయే రోజుల్లో భారత్‌లో కనీసం 2 లక్షల మంది ఈ రంగంలో ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం పొంచి ఉంది.

ఇంకా ఎక్కువ కొలువులు పోయేవి..
నిజానికి భారత్‌కు ఇంతకుమించి భారీ దెబ్బ పడేదే. 1990 నుంచి 2010 దాకా భారత్‌లో కాల్‌సెంటర్ల బూమ్‌ నడిచింది. ఖర్చులు తగ్గించుకోవడానికి పాశ్చాత్య దేశాల్లోని కంపెనీలు వినియోగదారులకు సేవలందించే కాల్‌ సెంటర్లను పొరుగు సేవల (ఔట్‌సోర్సింగ్‌కు ఇవ్వడం) ద్వారా భారత్‌కు మార్చాయి. ఈ సమయంలో మెట్రో నగరాలతో పాటు ద్వితీయశ్రేణి నగరాలకూ కాల్‌ సెంటర్లు విస్తరించాయి. రూ.15 నుంచి రూ.20 వేల వేతనానికే ఉద్యోగులు లభించడం, ఆంగ్లంపై భారతీయులకు పట్టుండటం అప్పట్లో మనకు కలిసి వచ్చింది. అయితే యాసతో ఇబ్బందులు వచ్చేవి.

ఈ విషయంలో తమకు సరైన సేవలు అందలేదని వినియోగదారుల నుంచి వచ్చే ఫిర్యాదులు బాగా పెరిగిపోవడంతో కంపెనీలకు ఫిలిప్పీన్స్‌ ఆశాకిరణంలా నిలిచింది. ఒకప్పుడు ఆంగ్లేయుల పాలనలో ఉన్న కారణంగా ఫిలిప్పీన్స్‌ దేశస్తులకు ఆంగ్లం బాగావచ్చు. అదీగాకుండా అమెరికన్ల యాసకు దగ్గరగా వీరు మాట్లాడతారు. దాంతో 2010 నుంచి భారత్‌ 70 శాతం కాల్‌ సెంటర్ల వ్యాపారాన్ని ఫిలిప్పీన్స్‌కు కోల్పోయింది. టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్‌ వంటి భారత దిగ్గజ ఐటీ కంపెనీలు కూడా తమ కాల్‌ సెంటర్లను ఫిలిప్సీన్స్‌కు తరలించాయి. అలా ఈ రంగంపై ఆధారపడ్డ భారతీయుల ఉద్యోగాలు తగ్గిపోయాయి. లేకుంటే అమెరికా చట్టసభల ముందుకొచ్చిన కొత్త బిల్లు ప్రభావం మనపై ఇంకా తీవ్రంగా ఉండేది.

బిల్లులో ఏముందంటే..
జెనె గ్రీన్‌ (డెమొక్రాట్‌), డేవిడ్‌ మెకిన్లే (రిపబ్లికన్‌)లు గురువారం అమెరికా కాంగ్రెస్‌లో ‘యూఎస్‌ కాల్‌ సెంటర్, కన్సూ్మర్‌ ప్రొటెక్షన్‌ యాక్ట్‌’ను ప్రవేశపెట్టారు. అమెరికా కంపెనీలు వినియోగదారులకు సేవలందించేందుకు తమ కాల్‌ సెంటర్లను విదేశాల్లో పెట్టకుండా ఈ బిల్లు నిరోధించదు. కానీ అమెరికా నుంచి కాల్‌సెంటర్‌ ఉద్యోగాలు మరో దేశానికి తరలి వెళ్లకుండా నిరోధించే పలు చర్యలు ఇందులో పొందుపరిచారు.
► కాల్‌ సెంటర్లను విదేశాల్లో నెలకొల్పే కంపెనీలతో ఒక జాబితాను రూపొందిస్తారు
► ఈ జాబితాలో ఉన్న కంపెనీలకు అమెరికా ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులు (గ్రాంట్లు) అందవు. అమెరికాలో ఉద్యోగాల కల్పనకు మాత్రం కంపెనీలకు గ్రాంట్లు ఇస్తుంది
► ఇలాంటి కంపెనీలకు రుణాలు (థర్డ్‌ పార్టీ పూచీకత్తుపై ఇచ్చేవి) ఇవ్వరు
► కాల్‌ చేసే వినియోగదారులకు తాము ఎక్కడి నుంచి మాట్లాడుతున్నామో కంపెనీ ప్రతినిధి ముందుగా చెప్పాలి
► ఒకవేళ అమెరికా గడ్డపై నుంచి పనిచేస్తున్న కాల్‌ సెంటర్‌కు తమ కాల్‌ను మళ్లించాలని వినియోగదారుడు కోరుకుంటే... కంపెనీ తప్పనిసరిగా అలా చేయాల్సిందే
► వినియోగదారుడు కోరితే కాల్‌ను అమెరికాలో పనిచేసే వ్యక్తికి మళ్లించడం తప్పనిసరి చేయడం మూలంగా... విదేశాల్లో కాల్‌ సెంటర్లు ఉన్నప్పటికీ అమెరికాలోనూ అలాంటి సేవలను అందించే కేంద్రం నెలకొల్పక తప్పని పరిస్థితిని కంపెనీలకు కల్పిస్తున్నారు. తమ వారికి ఉద్యోగాలు వస్తాయనే భావనతో అమెరికన్లు.. కాల్‌ను తమ దేశానికే మళ్లించమని కోరతారు
► తక్కువ వేతనాలు, ఖర్చులు ఉంటాయనే కారణంతో భారత్, ఫిలిప్పీన్స్‌ లాంటి దేశాల్లో కాల్‌ సెంటర్లు పెట్టిన కంపెనీలు.. రెండు చోట్ల (విదేశాల్లో, అమెరికాలో) కేంద్రాలను నిర్వహించే ఖర్చును తట్టుకోలేవు. దాంతో అనివార్యంగా తమ కాల్‌ సెంటర్లను తిరిగి అమెరికాకు తీసుకెళ్తాయి
► పైగా ఈ జాబితాలోకి ఎక్కితే దేశ ప్రయోజనాలను పట్టించుకోని కంపెనీగా అధికారికంగా ముద్ర పడుతుంది. బ్రాండ్‌ ఇమేజ్‌కు ఎంతో ప్రాధాన్యమిచ్చే పెద్ద కంపెనీలు ఈ పరిస్థితిని కోరుకోవు

Advertisement
Advertisement