అలా చేస్తే కిమ్‌ దగ్గర నుంచి ఫాస్ట్‌గా వస్తా | Sakshi
Sakshi News home page

అలా చేస్తే కిమ్‌ దగ్గర నుంచి ఫాస్ట్‌గా వచ్చేస్తా : ట్రంప్‌

Published Mon, Mar 12 2018 9:11 AM

Donald Trump Says North Korea Talks Could Fail Or win - Sakshi

న్యూయార్క్‌ : తమ మధ్య జరిగే సమావేశం విఫలమవ్వొచ్చు లేదా గొప్ప ఫలితాన్ని ఇవ్వొచ్చని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జాంగ్‌ ఉన్‌తో ట్రంప్‌ సమావేశం అవనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్రంప్‌ స్పందిస్తూ 'కిమ్‌తో జరిగే భేటీలో ఎలాంటి ఒప్పందం జరగకపోవచ్చు.. లేదా ప్రపంచం మొత్తానికి మేలు జరిగే ఫలితం రావొచ్చు' అని అన్నారు. ఇరు దేశాల మధ్య అణుపరమైన అంశాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. మొన్నటి వరకు నువ్వొకటి అంటే తాను రెండు అంటానంటూ బాంబుల వర్షం కురిపించి సర్వనాశనం చేస్తానంటూ ఇరువురు నేతలు కూడా తీవ్రంగా గర్జించారు.

అయితే, ఇటీవల దక్షిణ కొరియాలో జరిగిన ఒలింపిక్స్‌ గేమ్స్‌లో పాల్గొన్న ఉత్తర కొరియా ఆ సమయంలోనే తాను అమెరికాతో చర్చలు జరిపేందుకు సిద్ధం అని ప్రకటించింది. కిమ్‌తో భేటీ ఏర్పాట్లు కూడా శరవేగంగా సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే రిపబ్లికన్‌ నేత రిక్‌ సాకోన్‌ నిర్వహిస్తున్న ఓ ర్యాలీలో పాల్గొన్న ట్రంప్‌ స్పందిస్తూ 'ఆ భేటీలో ఎలాంటి సానుకూలత కనిపించకుంటే మాత్రం నేను వెంటనే వదిలేసి వస్తాను. అయినా అక్కడ ఏం జరుగుతుందో ఎవరు మాత్రం ఊహించగలరు.. నేను అక్కడి నుంచి వెళ్లి రావొచ్చు లేదా.. ప్రపంచం మొత్తానికి మేలు జరిగే గొప్ప ఒప్పందమే చోటుచేసుకోవచ్చు' అని ఆయన అన్నారు. ఇప్పటికే ఉత్తర కొరియా క్షిపణి పరీక్షలు నిర్వహించడం లేదని, గత నవంబర్‌ 28 నుంచి ఆపేసిందని, మున్ముందు కూడా అలా చేయబోమంటూ వారు చెప్పిన మాటలు నమ్ముతున్నట్లు ట్రంప్‌ ఇదివరకే ట్విటర్‌ ద్వారా చెప్పిన విషయం తెలిసిందే. 

Advertisement
Advertisement