Donald Trump Slams 'WHO' on Supporting China Regarding Coronavirus, Said it is unfair | డబ్ల్యూహెచ్‌ఓ తీరుపై ట్రంప్‌ విమర్శలు - Sakshi
Sakshi News home page

చైనా- అమెరికా మాటల యుద్ధం.. డబ్ల్యూహెచ్‌ఓపై విమర్శలు

Published Thu, Mar 26 2020 1:50 PM

Donald Trump Says WHO Sided With China On Coronavirus It Is Unfair - Sakshi

వాషింగ్టన్‌: మహమ్మారి కరోనా వైరస్‌(కోవిడ్‌-19)ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) తీరును విమర్శించారు. కరోనా విషయంలో డబ్ల్యూహెచ్‌ఓ చైనాను వెనకేసుకొస్తోందని.. ఇది నిజంగా విచారించదగ్గ విషయం అన్నారు. చైనాలోని వుహాన్‌ పట్టణంలో తొలిసారిగా ప్రాణాంతక కరోనా వైరస్‌ బయటపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మహమ్మారి పుట్టుకకు చైనీయుల ఆహారపు అలవాట్లే కారణమని తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఇక అగ్రరాజ్యం అమెరికా సైతం కరోనా వ్యాప్తికి చైనానే కారణమంటూ విమర్శలు గుప్పించింది. కరోనాను చైనీస్‌ వైరస్‌ అంటూ ట్రంప్‌ మాటల యుద్దానికి తెరతీశారు. ఈ క్రమంలో చైనా సైతం అమెరికాకు గట్టిగానే బదులిచ్చింది. అమెరికా సైనికులే కరోనా వైరస్‌ను వుహాన్‌కు తీసుకువచ్చారని ఎదురుదాడికి దిగింది.(కరోనా: 20 వేలు దాటిన మరణాలు.. అత్యధికంగా అక్కడే)

ఈ నేపథ్యంలో జనవరిలో ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్‌ టెడ్రోస్‌ అధనోమ్‌ ఘెబ్రేయేసస్‌ చైనాలో పర్యటించిన విషయాన్ని తెరపైకి తీసుకువచ్చి అమెరికా అధికార రిపబ్లికన్‌ పార్టీ సెనేటర్‌ మాక్రో రూబియో, కాంగ్రెస్‌ సభ్యుడు మైఖేల్‌ మెకాల్‌ తాజాగా విమర్శలు చేశారు. కరోనా వ్యాప్తిని కట్టడి చేయడంలో చైనా నాయకత్వం గొప్పగా పనిచేసిందని టెబ్రోస్‌ ప్రశంసించిన తీరును వారు తప్పుబట్టారు. చైనాతో ఉన్న పాత సంబంధాలతోనే ఆయన ఆ దేశాన్ని పొగుడుతున్నారంటూ ఆరోపణలు గుప్పించారు. ఇక మరో సెనేటర్‌ జోష్‌ హావ్లే సైతం ఇదే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ‘‘ఇందుకు సంబంధించి విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రపంచానికి వ్యతిరేకంగా డబ్ల్యూహెచ్‌ఓ చైనా కమ్యూనిస్టు పార్టీకి అండగా నిలిచింది’’ అని అక్కసు వెళ్లగక్కారు. (‘చైనీస్‌’ వైరస్‌పై ఘాటుగా స్పందించిన రోంగ్‌)

అదే విధంగా కరోనా విషయంలో చైనాతో కలిసి కుట్రపన్నారని పలువురు నేతలు ఆరోపణలకు దిగారు. ఈ విషయం గురించి శ్వేతసౌధంలో బుధవారం జరిగిన పత్రికా సమావేశంలో విలేకరులు ట్రంప్‌ ముందు ప్రస్తావించారు. ఇందుకు బదులిచ్చిన ట్రంప్‌... ‘‘డబ్ల్యూహెచ్‌ఓ చైనాకు చాలా చాలా మద్దతుగా నిలుస్తోంది. ఈ విషయం గురించి చాలా మంది అసంతృప్తిగా ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదు’’ అని వ్యాఖ్యానించారు. కాగా కరోనా ధాటికి ప్రపంచవ్యాప్తంగా బుధవారం నాటికి సుమారు 21,293 మరణాలు సంభవించగా.. 471518 మందికి ఈ అంటువ్యాధి సోకినట్లు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి.(చైనా దాస్తోంది: పాంపియో )

Advertisement
Advertisement