ట్రంప్ మాటల్లో నిజమెంత? | Sakshi
Sakshi News home page

ట్రంప్ మాటల్లో నిజమెంత?

Published Wed, Jan 31 2018 8:18 PM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ - Sakshi

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాంగ్రెస్ సభ్యులనుద్దేశించి చేసిన స్టేట్ ఆఫ్ ద యూనియన్ (ఏటా జనవరిలో దేశ పరిస్థితుల సమీక్ష) ప్రసంగంలో సాధించిన విజయాలతోపాటు భవిష్యత్తులో తీసుకునే చర్యల గురించి ప్రస్తావించారు. ఉపన్యాసంలో 80 శాతం సాధించిన అంశాలుంటే, 20 శాతం మిగిలిన మూడేళ్లలో చేయాలనుకునే విషయాలు వెల్లడించారు. ట్రంప్ తన 80 నిముషాల ప్రసంగంలోని మాటలు కొందరికి శుభవార్తలుగా కనిపిస్తే మరి కొందరికి నిరాశ కలిగించేవిగా ఉన్నాయని విశ్లేషకుల అంచనా.

అంచనాలకు భిన్నంగా మంచి ప్రసంగం!
ట్రంప్ తన అభిప్రాయలు వ్యక్తం చేసే ధోరణికి భిన్నంగా మంచి ప్రసంగం చేశారని పరిశీలకులు భావిస్తున్నారు. ఏ అధ్యక్షుడి లక్ష్యమైనా పూర్తికాలం పదవిలో కొనసాగడమే. ఆయన మాటలు కూడా 2021 జనవరి వరకూ తాను పదవిలో కొనసాగగలనన్న నమ్మకాన్ని సూచిస్తున్నాయి. సగటు అమెరికన్లు తక్కువ ఖర్చుతో ఆరోగ్యబీమా చేయించుకోవడానికి వీలు కల్పిస్తున్న ఒబామా కేర్ పాలసీని ట్రంప్ రద్దు చేస్తానని ప్రకటించకపోవడం ప్రజకు ఊరటనిచ్చే విషయం.

ఈ పాలసీలోని తమకు నచ్చని అంశాన్ని రిపబ్లికన్లు తొలగించినా బీమా పథకాన్ని పూర్తిగా రద్దుచేయాలనే యోచన లేదని ప్రసంగం సూచిస్తోంది. ఇతర దేశాలతో పోల్చితే అమెరికాలో ఔషధాల ధరలు ఎక్కువని చెబుతూ, అవి ప్రజలకు అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకుంటానని ఆయన అన్నారు. వాస్తవానికి ఫార్మా కంపెనీలను ఎలా లొంగదీసి ధరలు దిగివచ్చేలా చేస్తారో ప్రకటించ లేదు. అమెరికాలోకి వచ్చిన వలసదారులపై చట్టాలు, నిబంధనలు కట్టుదిట్టంగా అమలు చేస్తానని ఆయన ప్రసంగించారు. అయితే, హోంలాండ్ భద్రతా శాఖ ఒత్తిడి కారణంగా వాటిని ఎలా అమలు చేసేదీ చెప్పకపోవడం వల్ల వలసదారుల్లో ఆందోళన తగ్గదు.

భారీ పన్నుల కోత ఎంత నిజం?
అమెరికా చరిత్రలో అత్యంత భారీగా పన్నులు తగ్గించినది తమ ప్రభుత్వమేనని ట్రంప్ ప్రకటించారు. ఇటీవల పన్నుల కోత బిల్లు ద్వారా తగ్గించింది ఎక్కువేమీ కాదు. ట్రంప్ తగ్గింపుతో పోల్చితే గతంలో నాలుగుసార్లు(1964, 81, 2010, 13) చేసిన పన్ను కోతలే చాలా ఎక్కువ. నల్లజాతివారిలో నిరుద్యోగం అత్యంత కనిష్ట స్థాయిలో 6.8శాతం ఉందని అంటూ ఇది తన వల్లే సాధ్యమైందనే ధోరణితో మాట్లాడారు. శ్వేతజాతీయుల్లో నిరుద్యోగం 3.7 శాతం ఉందంటే, ఆఫ్రికన్ అమెరికన్లలో నిరుద్యోగాన్ని బాగా తగ్గించినట్టు చెప్పడం సబబుకాదు. ఆర్థికవ్యవస్థ ముందుకు దూకుతున్న కారణంగా తెల్లవారితోపాటు నల్లవారిలో కూడా నిరుద్యోగం తగ్గుతోందని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. 2016 నవంబర్ ఎన్నికలనాటి నుంచి ఇప్పటి వరకూ దేశంలో కొత్తగా 24 లక్షల ఉద్యోగాలు వచ్చాయన్న ట్రంప్ మాటలు నిజమే. అయితే, 2009 నుంచీ అంటే ఒబామా హయాం నుంచే కొత్త ఉద్యోగాలు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి.

జీతాలు పెరుగుతున్నాయా?
అనేక ఏళ్లుగా ఎదుగూబొదుగూ లేకుండా ఉన్న జీతాలు ఇప్పుడు పెరగడం చూస్తున్నామని ట్రంప్ తన ప్రసంగంలో గుర్తుచేశారు. కార్మికుల వేతనాలు 2016లో 2.6 శాతం పెరిగాయి. ట్రంప్ అధికారం చేపట్టిన ఏడాది కాలంలో కూడా జీతాల పెరుగుదల రేటు అదే స్థాయిలో ఉందేగాని మెరుగుపడలేదు. 2010 అక్టోబర్ నుంచి నెలనెలా జీతాలు పెరుగుతున్నాగాని అప్పటి నుంచి వేతనాలు సగటున 2.2 శాతమే పెరిగాయి. కార్ల తయారీ కంపెనీలను కుంగదీసే నిబంధనలు తొలగించిన కారణంగా వాహనాల అమ్మకాలు పెరిగాయని ట్రంప్ చెప్పుకున్నారు. బరాక్ ఒబామా అధ్యక్షునిగా ఉన్న చివరి సంవత్సరం 2016లో కోటీ 76 లక్షలున్న కార్ల అమ్మకాలు 2017లో కోటీ 72 లక్షలకు తగ్గిపోయాయి. 2009 నుంచీ పెరుగుతూనే ఉన్న అమ్మకాలు మొదటిసారి కిందటేడాది తగ్గుముఖం పట్టాయి. కార్ల తయారీ పరిశ్రమ పరిస్థితి బాగున్న మాట వాస్తవమేగాని 2009లో ఒబామా సర్కారు జనరల్ మోటర్స్, క్రిజలర్ కంపెనీలకు ఆర్థిక సాయమందించి, వాటిని ఒడ్డున పడేసినప్పటి నుంచే ఆటో పరిశ్రమ ఆరోగ్య కరమైన రీతిలో ఎదుగుతోంది.

ఇంథనం ఎగుమతులు పెరిగాయా?
ముడి చమురు సహా అమెరికా ఇంధనం ఎగుమతులు పెరుగుతున్నాయని ట్రంప్ తెలిపారు. ఎగుమతులతోపాటు దిగుమతులు కూడా కొన్ని దశాబ్దాలుగా సాగుతున్నాయి. అయితే, ప్రపంచ క్రూడాయిల్ విపణిలో వచ్చిన మార్పుల కారణంగా 2015లో ఒబామా సర్కారు ముడి చమురు ఎగుమతులకు తలుపులు బార్లా తెరిచింది. ఫలితంగా దేశం నుంచి ముడి చమురు ఎగుమతులు గణనీయంగా పెరిగాయి. అంతేగాని ట్రంప్ ప్రభుత్వం పాత్ర ఇందులో ఏమీ లేదు. ప్రస్తుత విధానాల కారణంగా ఒక వలసదారు తన దూరపు బంధువులను దేశంలోకి లెక్కలేనంత సంఖ్యలో రప్పించుకోవచ్చని ట్రంప్ చెప్పారు. వలస, పౌరసత్వ చట్టాలను సమగ్రంగా పరిశీలిస్తే వీటిలోని నిబంధనలు ట్రంప్ చెప్పిన విషయం వాస్తవ విరుద్ధమని రుజువుచేస్తున్నాయి. ఇప్పుడున్న నిబంధనల ప్రకారం కూడా ఇష్టారీతిన కుటుంబసభ్యులను తెచ్చుకునే వీలులేదు.

(సాక్షి నాలెడ్జ్ సెంటర్)

Advertisement
Advertisement