Sakshi News home page

కూతురిపైనా ట్రంప్ కారుకూతలు

Published Mon, Oct 10 2016 2:00 AM

కూతురిపైనా ట్రంప్ కారుకూతలు - Sakshi

ఇవాంకా శరీర సౌష్టవంపై అసభ్య వ్యాఖ్యలు
తెరపైకి ట్రంప్ పాత ఇంటర్వ్యూ వీడియోలు
ఈ వ్యాఖ్యలు సరికావు: ట్రంప్ భార్య మెలానియా

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఇబ్బందుల్లో కూరుకుపోతున్నారు.  మహిళలపై చేసిన వ్యాఖ్యలపై దుమారం చల్లారకముందే.. ఏకంగా తన కూతురిపైనే అసభ్యకర వ్యాఖ్యలు చేసిన వీడియో బయటపడటంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. 17 ఏళ్ల క్రితం హోవార్డ్ స్టెర్న్ అనే రేడియో జర్నలిస్టుకు ఇచ్చిన ఇంటర్వ్యూ బహిర్గతమైంది. ఈ ఇంటర్వ్యూలో తన కూతురు ఇవాంకా ట్రంప్‌పై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు.

ఎత్తు, బరువుతో పాటు శరీర సౌష్టవం చక్కగా ఉందని చాలాసార్లు ట్రంప్ వ్యాఖ్యానించినట్లు సీఎన్‌ఎన్ కథనం ప్రచురించింది. ఆ వీడియోలో ‘చాలా మంది మహిళలు నేనంటే పడిచచ్చేవారు. నాకోసం ఏం చేసేందుకైనా వెనుకాడేవారుకాదు’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. 2006లో మరో ఇంటర్వ్యూలోనూ తన కూతురు మరింత సెక్సీగా కనబడుతోందని ట్రంప్ వ్యాఖ్యానించిన విషయాన్ని సీఎన్‌ఎన్ ప్రచురించింది. ట్రంప్ వ్యాఖ్యలు ఆక్షేపణీయమని ఆయన భార్య మెలానియా ట్రంప్ అన్నారు. అయితే, ఇదంతా గతమని.. అప్పటికీ, ఇప్పటికీ తన భర్త చాలా మారారన్న మెలానియా.. ట్రంప్ క్షమాపణలు కోరిన విషయాన్ని గుర్తుచేశారు.

 క్లింటన్‌కు భారతీయ అమెరికన్ల మద్దతు
మహిళలపై వ్యాఖ్యలతో సొంతపార్టీతోపాటు జనాల్లోనూ ట్రంప్ పట్టుకోల్పోతున్నారు. తాజా వీడియోతో.. భారత అమెరికన్లు చాలా మంది క్లింటన్‌కు మద్దతు ప్రకటించారు.   మెజారిటీ భారతీయ అమెరికన్లు మొదట్నుంచీ డెమొక్రాట్లకే మద్దతుగా నిలుస్తున్నారు. పాక్ ఉగ్రవాదం, ఇస్లామిక్ టైస్టులపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలతో ఓ వర్గం ఆయనకు మద్దతుగా నిలిచింది. అయితే.. తాజా పరిణామాల నేపథ్యంలో వీరూ హిల్లరీకే మద్దతు తెలిపారు. ‘ట్రంప్‌ను శ్వేతసౌధం చేరకుండా ఆపాలి.మహిళలపై ఆయన వ్యాఖ్యలు దారుణం. తల్లి, చెల్లి, భార్య, సమాజంపై గౌరవం లేని వ్యక్తి ట్రంప్’ అని కమలా హారిస్ (కాలిఫోర్నియా నుంచి సెనెట్‌కు పోటీ పడుతున్న భారత సంతతి మహిళ) తెలిపారు.

 హిల్లరీకే చాన్స్: నిపుణులు
డెమొక్రాట్ల అభ్యర్థి హిల్లరీకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ నిపుణులంటున్నారు. ఫ్లోరిడాతోపాటు పెద్ద రాష్ట్రాలైన ఉత్తర కరోలినా, ఒహియో, పెన్సిల్వేనియాలో ఏదైనా ఒక రాష్ట్రంలో గెలిస్తే సరిపోతుందని తెలిపారు. ఆదివారం రాత్రి జరిగే రెండో ‘అధ్యక్ష అభ్యర్థుల డిబేట్’లో హిల్లరీ గెలుస్తుందన్నారు.

 ట్రంప్‌ను ఎలా తప్పించాలి?: నెల రోజుల్లో ఎన్నికలుండగా అభ్యర్థిగా ట్రంప్‌ను తప్పించాలని పార్టీ పావులు కదుపుతోంది. కీలకనేతలు సహా మెజారిటీ సభ్యులు ట్రంప్‌కు వ్యతిరేకంగా ఉండటంతో రిపబ్లికన్ నేషనల్ కమిటీ (ఆర్‌ఎన్‌సీ) ఈ దిశగా అన్ని న్యాయపరమైన అవకాశాలను పరిశీలిస్తోంది. ‘పార్టీ నిబంధనల్లోని 9వ నియమం ప్రకారం ఆర్‌ఎన్‌సీలో ఓటింగ్ ద్వారా అధ్యక్ష అభ్యర్థిని మార్చవచ్చు. దీనికి అభ్యర్థి చనిపోవటమో, ఆరోగ్యం క్షీణించటమో లేదా ఇతర కారణాలను చూపించో తప్పించవచ్చు’ అని పార్టీ చెబుతోంది. ట్రంప్ తనంతటతానుగా తప్పుకోవటం లేదా, 168 మంది డెలిగేట్లున్న ఆర్‌ఎన్‌సీ భేటీలో పూర్తిస్థాయి మెజారిటీ లభిస్తే.. కొత్త అభ్యర్థిని (ఉపాధ్యక్ష స్థానానికి పోటీ పడుతున్న మైక్ పెన్స్) బరిలో దించే వీలుంది.

 ట్రంప్‌కు దూరమవుతున్న రిపబ్లికన్లు
ట్రంప్‌కు సొంతగూటిలో కుంపటి రాజుకుంటోంది. రిపబ్లికన్ పార్టీలోని కీలక నేతలు (సెనెటర్లు, గవర్నర్లు) ట్రంప్ శిబిరం నుంచి దూరమవుతున్నారు. ఎన్నికలనుంచి తప్పుకోవాలని పార్టీలో వ్యతిరేకత  పెరుగుతోంది. ఆయన కలలు కూడా ఒక్కొక్కటిగా కూలుతున్నాయి. ‘ఇకచాలు. ట్రంప్ తప్పుకోవాలి’ అంటూ మాజీ విదేశాంగ మంత్రి కండోలిజా రైస్ ఫేస్‌బుక్‌లో తెలిపారు. కాలిఫోర్నియా మాజీ గవర్నర్ ఆర్నాల్డ్ స్క్వార్జ్‌నెగ్గర్, ఒహియో సెనెటర్ రాబ్ పోర్ట్‌మాన్, దక్షిణ డకోటా గవర్నర్ డెన్నిస్ డగర్డ్ తదితరులు బహిరంగంగానే ట్రంప్‌కు దూరమవుతున్నట్లు ట్విటర్లో ప్రకటించారు. రిపబ్లికన్ల ఉపాధ్యక్ష అభ్యర్థి మైక్ పెన్స్ మాత్రం జాగ్రత్తగా మాట్లాడారు. ‘ట్రంప్ వ్యాఖ్యలు సమర్థనీయం కాదు. కానీ ఆయన గొప్ప మనసుతో క్షమాపణలు కోరారు. ఆదివారం (భారత కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారుజామున) జరిగే రెండో డిబేట్‌లో ఆయనే దేశానికి సమాధానం చెబుతారు’ అని తెలిపారు.

కీలకదశకు ఎన్నికలు
అధ్యక్ష్య ఎన్నికలు కీలకదశకు చేరుకున్నాయి. అమెరికా ఎన్నికల చరిత్రలోనే గత సాంప్రదాయానికి భిన్నంగా ఈ ఎన్నికలు జరుగుతున్నాయని మీడియా పేర్కొంది. ఇద్దరు అసమర్థ అభ్యర్థులు బరిలో ఉన్నారంటూ ఓటర్లంటున్నారు. ఇటీవలి ఓ సర్వేలో 55 శాతం మంది హిల్లరీ, ట్రంప్‌లపై అభ్యంతరం తెలిపారు. ఆయా పార్టీల్లోనూ వీరిద్దరిపై సానుకూల అభిప్రాయం లేదు.

Advertisement
Advertisement