ప్లీజ్! నాకు ప్రపోజ్ చేయొద్దు... | Sakshi
Sakshi News home page

ప్లీజ్! నాకు ప్రపోజ్ చేయొద్దు...

Published Wed, Nov 18 2015 12:00 AM

ప్లీజ్! నాకు ప్రపోజ్ చేయొద్దు... - Sakshi

న్యూయార్క్: 'ప్లీజ్! నాకు ప్రపోజ్ చేయొద్దు. క్రేజీ సందేశాలు పంపించొద్దు. నాకు వివాహం అయింది. అందమైన భార్య ఉంది. ముద్దులొలికే కొడుకు కూడా ఉన్నాడు. నేను నా భార్యను అమితంగా ప్రేమిస్తున్నాను. ఆమె నాకు ఎంతో మంచిది. ఆమెకు నేనెలాంటి ద్రోహం తలపెట్టను. సోషల్ మీడియాలో నాకు ఎలాంటి సందేశాలు పంపొద్దు. వాటిని నేను చదివే ప్రసక్తే లేదు. కనీసం వాటిని చూడను కూడా చూడను. మీ మంచికే నేను చెబుతున్నా. నేను చెప్పేది అర్థమైందనుకుంటా!' భార్యను హేరోగా కీర్తిస్తూ హఠాత్తుగా ఆన్‌లైన్ హీరోగా మారిపోయిన అలబామాలోని బర్మింగమ్ సిటీకి చెందిన బాబీ వెసన్ ఫేస్‌బుక్ ద్వారా తాజాగా పంపిన క్లిప్పింగ్ సందేశమిది.


 'ఎవరైనా ఇకముందు నీకు ప్రపోజ్ చేసినా, క్రేజీ మెస్సేజ్ పంపినా నిన్ను చంపెస్తా!' అంటూ భార్య రయేనా కత్తితో సరదాగా బెరిరిస్తున్న క్లిప్పింగ్ కూడా ఆ సందేశంలో ఉంది. రయేనా బర్మింగమ్ నగరంలోని ఓ ఆస్పత్రిలోని ఎమర్జెన్సీ వార్డులో పనిచేస్తోంది. 14 గంటలపాటు నిర్విరామంగా ఆస్ప్రత్రిలో రకరకాల రోగులకు సేవలందించి అలసిపోయి ఇంటికొస్తోంది. అలా గత శనివారం కూడా ఇంటికొచ్చి  కొడుకును పక్కనేసుకొని పడుకున్న భార్య ఫొటోతోపాటు 'నా భార్యే నా హీరో' అంటూ ఆయన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన సందేశం సంచలనం సృష్టించింది. దాన్ని కొన్ని లక్షల మంది వీక్షించారు. స్పందించి సందేశాలు పంపుతున్నారు. పుంఖానుపుంఖంగా ప్రపోజల్స్, క్రేజీ సందేశాలు వచ్చి పడుతున్నాయి. వాటిని తట్టుకోలేకనే ఈ రెండో క్లిప్పింగ్ సందేశాన్ని పంపించారు. దీన్ని కూడా కొన్ని లక్షల మంది వీక్షిస్తున్నారు. వేలాది మంది షేర్ చేసుకుంటున్నారు. మొదటి సందేశం ఎలా ఉందంటే...
 నా భార్యే నా హీరో
 'ఈమే నాభార్య రయేనా. ఒక గంటలో లేస్తుంది. చకచకా ఆస్పత్రికి తయారవుతుంది. ఆదరాబాదరాగా మేకప్ అవుతుంది. నేను కప్పు కాఫీ కలిపిస్తాను. గబగబా తాగేసు, కొడుకును ముద్దాడి, నన్ను ముద్దుపెట్టుకొని ఆస్పత్రికి బయల్దేరి వెళుతుంది. అక్కడ మానవ జీవితంలోనే అత్యంత విషాధమైన రోజులను లెక్కపెడుతున్న రోగుల బాగోగులు చూసుకుంటుంది. రక్తమోడుతున్న రోగుల గాయాలను శుభ్రం చేస్తుంది. రక్తాన్ని తుడిచేస్తుంది. వారి మలమూత్రాలను ఎత్తిపోస్తుంది. 14 గంటల డ్యూటీ అనంతరం అలసిపోయి ఇల్లు చేరుతుంది. ఒక్కొక్క సారి ముభావంగా ఉంటుంది. పిల్లాడితో కబుర్లు చెప్పి కాసేపు పడుకుంటుంది. అప్పుడప్పుడు తోటి నర్సులు, మెడికల్ ప్రొఫెషనల్స్, రోగుల గురించి కథలు కథలుగా చెబుతుంది.
 ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైద్య సిబ్బందిలో తాను చిన్న పిపీలికం మాత్రమేనని అంటుంది. పిపీలికం లాంటి నా చిన్న కుటుంబంలో అమె నిర్వహించేది పెద్ద పాత్ర. ఆమె మాకు పెద్దదిక్కు. ఆమెను చూసి గర్విహిస్తున్నా. 'ఆమె నా హీరో 'అంటూ బాబీ వెసన్ పంపిన సందేశానికి దాదాపు మూడు లక్షల లైక్స్ వచ్చాయి.

Advertisement
Advertisement