సిరియాలో మరో విష దాడి! | Sakshi
Sakshi News home page

సిరియాలో మరో విష దాడి!

Published Mon, Apr 9 2018 2:02 AM

Dozens Suffocate in Syria as Government Is Accused of Chemical Attack - Sakshi

బీరుట్‌: అంతర్యుద్ధంతో అట్టుడుకుతున్న సిరియాలో మరో విష రసాయన దాడి జరిగింది. తిరుగుబాటుదారుల అధీనంలో ఉన్న డౌమా పట్టణంపై జరిగిన ఈ దాడిలో 42 మందికి పైగా ప్రజలు మృత్యువాతపడ్డారు. వందలాది పౌరులు శ్వాస, కంటిచూపు సమస్యలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. చనిపోయినవారిలోనూ, శ్వాస తీసుకోవడంలో తీవ్రమైన ఇబ్బందికి గురైన వారిలోనూ చిన్నారులే అధికంగా ఉన్నారు. పలు భవనాల్లో మృతదేహాలు కుప్పలుగా పడి ఉన్న హృదయ విదారక దృశ్యాలు కనిపించాయి.

తిరుగుబాటుదారులు లక్ష్యంగా సిరియా ప్రభుత్వమే ఈ దారుణానికి పాల్పడిందన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ దాడిని అమెరికా అధ్యక్షుడు ట్రంప్, పోప్‌ ఫ్రాన్సిస్, పలు దేశాల అధినేతలు తీవ్రంగా ఖండించారు. అయితే, ఈ ఆరోపణలను సిరియా, ఆ దేశానికి మద్దతుగా నిలుస్తున్న రష్యా ఖండించాయి. ఈ ఘటనపై తక్షణమే విచారణ జరపాలనీ, విషవాయువు ప్రయోగం జరిగినట్లు తేలితే సిరియా అధ్యక్షుడు బషర్‌ అల్‌ అస్సద్‌ క్రూరత్వానికి ఇది మరో ఆధారంగా నిలుస్తుందని బ్రిటన్‌ విదేశాంగ శాఖ పేర్కొంది.

42 మంది వారివారి ఇళ్లలో చనిపోయి ఉండటాన్ని గుర్తించామనీ,  వీరంతా ఊపిరి తీసుకోవడం కష్టమవ్వడం వల్లనే మరణించినట్లు తెలుస్తోందని, మృతుల సంఖ్య ఇంకా ఎక్కువ ఉండొచ్చనీ సహాయక సిబ్బంది చెప్పారు. చిన్నారులు, మహిళలు సహా అనేక మంది శవాలు ఇళ్లలో ఎక్కడ పడితే అక్కడ ఉండటాన్ని చూపుతూ పలు వీడియోలు విడుదలయ్యాయి. మృతుల నోళ్లు, ముక్కుల నుంచి తెల్లని నురగ బయటకు రావడం వీడియోల్లో కనిపించింది.

అవి నకిలీ వీడియోలు: సిరియా
రసాయనిక దాడి జరిగిందనడాన్ని సిరియా అధికారిక మీడియా ఖండించింది. తిరుగుబాటుదారులే అంతర్జాతీయంగా మద్దతు పొందటం కోసం నకిలీ వీడియోలను విడుదల చేశారని పేర్కొంది. రష్యా విదేశాంగ, రక్షణ మంత్రిత్వ శాఖలు కూడా రసాయనిక దాడి అబద్ధమని పేర్కొన్నాయి. ప్రస్తుతం డౌమా పట్టణాన్ని సిరియా భద్రతా దళాలు చుట్టుముట్టాయి. ప్రస్తుతం తూర్పు గౌటా ప్రాంతంలో తిరుగుబాటుదారుల చేతిలో ఉన్న ఏకైక పట్టణం డౌమా మాత్రమే. శనివారం మధ్యాహ్నం వైమానిక దాడి జరిగిన తర్వాత తమకు కళ్లు మండుతున్నాయనీ, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందిగా ఉందం టూ 15 మంది వైద్యశాలలకు వచ్చారు.

ఆ తర్వాత శనివారం రాత్రి ఓ ప్రభుత్వ హెలికాప్టర్‌ వచ్చి గుర్తు తెలియని రసాయనాన్ని వెదజల్లిందనీ, దీని వల్ల ఇంకా అనేకమంది ప్రజలు విషవాయువు బారిన పడ్డారని సహాయక సిబ్బంది వివరించారు. నిరంతరాయంగా జరుగుతున్న దాడుల వల్ల మృతదేహాలను వెతకడం కష్టంగా ఉందనీ, మరణించిన వారి సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉండొచ్చని వారు అంటున్నారు. విషపూరిత క్లోరిన్‌ వాయువుతో ప్రభుత్వ దళాలు దాడిచేసినట్లు ‘వైట్‌ హెల్మెట్స్‌’ అనే స్వచ్ఛంద సంస్థ ఆరోపించింది. 40 నుంచి 70 మంది విషవాయువు కారణంగా మరణించి ఉంటారని తెలిపింది. శుక్రవారం సాయంత్రం నుంచి సిరియా జరిపిన వైమానిక దాడులతో కలిపి మృతుల సంఖ్య 80కి పైగానే ఉంటుందంది.

అసద్‌ ఓ జంతువు: ట్రంప్‌
సిరియా అధ్యక్షుడు అసద్‌ ఓ జంతువనీ, ఆయన చర్యను మతిలేనిదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విమర్శించారు. ఇరాన్, రష్యాల మద్దతుతోనే సిరియా రెచ్చిపోతోందన్నారు. ‘డౌమాను సిరియా సైన్యం చుట్టుముట్టి ఇతరులను అక్కడకు వెళ్లనివ్వడం లేదు. అసద్‌కు మద్దతునిస్తున్న రష్యా, ఇరాన్‌లే ఇందుకు బాధ్యులు. భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది’ అని ట్రంప్‌ ట్వీటర్‌లో పేర్కొన్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా సైనిక చర్య చేపట్టి ఉంటే నేడు అసద్‌ అనే వ్యక్తి ఉండేవాడే కాదన్నారు.
 

Advertisement
Advertisement