లేటు వయసులో ఘాటు ప్రేమ | Sakshi
Sakshi News home page

లేటు వయసులో ఘాటు ప్రేమ

Published Sun, May 29 2016 5:41 PM

లేటు వయసులో ఘాటు ప్రేమ

లండన్: ప్రముఖ బడా వ్యాపార వేత్త, టీవీ డ్రాగన్ స్టార్ డంకన్ బన్నాటిన్(67) మరోసారి ప్రేమలో పడ్డాడు. అది కూడా తన వయసులో సగం వయసున్న మహిళతో. గత పది నెలల కిందట ఆమెపై మోజుపడిన ఇతగాడు ఇప్పుడు పోర్చుగల్ వీధుల్లో చక్కగా చక్కెర్లు కొడుతున్నాడు. ఆయన గురించి సూక్ష్మంగా తెలుసుకుంటే.. ఇప్పటికే ఇద్దరు భార్యలు, ఆరుగురు సంతానం ఉన్నారు. ఆ భార్యలకు విడాకులు ఇచ్చి ఖాళీగా ఉంటున్న డంకన్ గత పది నెలల కిందట ఓ కార్యక్రమంలో నిగోరా అనే మూడుపదుల దాటుతున్న(36) మహిళను చూసి మనసు పారేసుకున్నాడు.

ఆమెకు ఓ పదమూడేళ్ల కూతురు కూడా ఉంది. తొలుత తన మనసులో మాట ఆమెతో చెప్పేందుకు భయపడిన ఆయన తర్వాత మెల్లగా మాటలు కలుపుతూ పరిచయం పెంచుకుని తనంటే ఇష్టపడేలా మార్చుకున్నాడు. ప్రారంభం రోజుల్లోనే ఏకంగా ఆమెతో పడకగదిలో ఉన్నట్లు ఫొటోలు సోషల్ మీడియాలో పెట్టిన ఆయన ఈసారి మాత్రం తాను ఆమెకు ప్రపోజ్ చేస్తున్నట్లున్న ఫొటోలు, డిన్నర్ కు వెళ్లిన ఫొటోలు పెట్టాడు. అయితే, ఇదంతా చూస్తున్న అక్కడి మీడియా మాత్రం డంకన్ కు ఉన్న డబ్బు చూసే నిగోరా ఆయనకు దగ్గరయిందంటూ గుసగుసలు వినిపించాయి.

అయితే, దీనిపై వెంటనే స్పందించిన నిగోరా.. తాను డబ్బు చూసి ఆయనను ఇష్టపడలేదని, ఆయనంటే తనకు నిజంగానే ప్రేమ అని బల్లగుద్ది చెప్పింది. తామెప్పుడూ ప్రేమపక్షుల్లాగే ఉండిపోతామంటూ చెప్పింది. డంకన్ కూడా ఇటీవల 'నిన్నెప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను' అంటూ ఓ పోస్ట్ కూడా చేశాడు. ఏదేమైనా గత పది నెలలుగానే నిగోరాతో సంబంధాలు నెరుపుతున్న డంకన్.. తాజాగా ప్రొపోజల్ చేసేందుకు మాత్రం దాదాపు 40 వేల పౌండ్ల విలువైన ఉంగరాన్ని బహుమానంగా ఇచ్చి మరోసారి వార్తల్లో నిలిచారు.

Advertisement
Advertisement