మళ్లీ కంపించిన నేపాల్ | Sakshi
Sakshi News home page

మళ్లీ కంపించిన నేపాల్

Published Sun, May 3 2015 2:26 AM

earthquake in nepal

కఠ్మాండు: భారీ భూకంపంతో కుదేలైన నేపాల్‌ను శనివారం మరోసారి భూప్రకంపనలు వణికించాయి. గూర్ఖా జిల్లాలోని బార్పక్ గ్రామంలో రిక్టర్ స్కేలుపై 5.1 తీవ్రతతో భూమి కంపించింది. దీంతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ప్రాణభయంతో సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. భూప్రకంపన వల్ల ఒక మహిళ గాయపడింది. గత శనివారం రిక్టర్ స్కేలుపై 7.9తో వచ్చిన భారీ భూకంప కేంద్రానికి దగ్గరల్లోనే బార్పక్ గ్రామం ఉంది. తాజా భూప్రకంపన తర్వాత 4.5 తీవ్రతతో మరో భూప్రకంపన వచ్చింది. దీని కారణంగా దోలాల్‌ఘాట్ వద్ద భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి.
 
 మరోపక్క.. నేపాల్‌లో శనివారం నాటి భూకంప మృతుల సంఖ్య 7 వేలు దాటింది. మృతుల్లో 19 మంది భారతీయులు ఉన్నారు. మితేరీపుల్, చాకు, నయాపూర్ తదితర ప్రాంతాల్లో శిథిలాల నుంచి మృతదేహాలను వెలికితీస్తున్నారు. శిథిలాల కింద కొంత మంది విదేశీయుల మృతదేహాలు కూడా ఉండొచ్చని భావిస్తున్నారు. కెనడా, నెదర్లాండ్స్, తదితర దేశాల పర్యాటకలు పెద్ద సంఖ్యలో నేపాల్‌లో చిక్కుకుపోయారు. భూకంప ప్రాంతాలకు సహాయ సామగ్రి తరలింపులో జాప్యం జరుగుతోంది. దీంతో బాధితులు వీధుల్లోకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. సహాయ సామగ్రిని నల్లబజారుకు తరలిస్తున్నారని ఆరోపిస్తున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement