గ'ఘన' విహారం | Sakshi
Sakshi News home page

గ'ఘన' విహారం

Published Mon, Nov 28 2016 4:05 AM

గ'ఘన' విహారం

గాల్లో... అదీ మేఘాల్లో రివ్వు రివ్వున దూసుకెళుతూంటే ఎలా ఉంటుందంటారూ? ఊహూ... విమానంలో కూర్చొని కాదండీ. భుజానికి ఓ జెట్‌ప్యాక్ తగిలించుకుని వెళితే? ఏమో మాకేం తెలుస్తుంది అంటారా? అరుుతే ఓకే. కానీ ఆ థ్రిల్ ఎలా ఉంటుంది పక్క ఫొటోలో ఉన్న వారికి మాత్రం బాగా తెలుసండోయ్!

జెట్‌మన్‌లు దుబాయికి చెందిన ముగ్గురు ఈ మధ్యనే ఫ్రాన్‌‌సలో ఓ అబ్బురపరిచే విన్యాసం చేశారు. ఫ్రాన్స్ వాయుసేన విమానాలు ఒక నిర్ణీత పద్ధతి (ఫార్మేషన్) ప్రకారం వెళుతూంటే... ఈ ముగ్గురు కూడా ఆ విమానాలను ఫాలో అయ్యారు. ఇలా చేయడం ప్రపంచంలోనే మొట్టమొదటిసారి అట. నాలుగు వేల అడుగుల ఎత్తులో గంటకు 260 కిలోమీటర్ల వేగంతో  ఈ ప్రయాణం సాగింది. వాయు సేన విమానాలు గాల్లోకి ఎగసిన వెంటనే జెట్‌మ్యాన్ టీమ్ సభ్యులు హెలికాప్టర్ల అంచుల మీద నిలబడి గాల్లోకి ఎగిరారు. కొంచెం ఎత్తుకు వెళ్లిన తరువాత విమానాలు ఫార్మేషన్‌లో ప్రయాణించడం మొదలైంది. ఆ వెంటనే హెలికాప్టర్ల నుంచి కిందకు దూకేసిన జెట్‌మ్యాన్ టీమ్ సభ్యులు విమానాల వెంబడే ప్రయాణించడం మొదలుపెట్టారు. ఒక్కో సభ్యుడు జెట్ కార్ పీ400 ఇంజిన్లతో కూడిన జెట్‌ప్యాక్‌ను తగిలించుకుని తొమ్మిది నిమిషాలపాటు ప్రయాణించడం విశేషం.

హెలికాప్టర్ల అంచున నిలబడి సాహస ప్రయాణానికి సిద్ధమవుతూ...

 
గత ఏడాది ఇదే బృందం ఎమిరేట్స్ విమానం వెంబడి జెట్‌ప్యాక్‌లతో ప్రయాణించి రికార్డు సృష్టించింది. ఇందులో గొప్పేముంది అని తీసిపారేయొద్దు. అటు జెట్ పెలైట్లు... ఇటు జెట్‌మ్యాన్ సభ్యులు - ఇద్దరూ అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన విషయమిది. ఏ మాత్రం లెక్క తప్పినా... ఇద్దరికీ ప్రమాదమే. జెట్‌మ్యాన్ సభ్యులు కేవలం తమ శరీర కదలికల ద్వారా మాత్రమే తమ స్థానాన్ని అటూ ఇటూ చేయగలగడం ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం.

హెలికాప్టర్ల నుంచి గగనంలో దూకేసిన జెట్‌మ్యాన్ సభ్యులు

Advertisement
Advertisement