స్నేహ సంబంధాలను పెంచుతున్న 'బార్'..! | Sakshi
Sakshi News home page

స్నేహ సంబంధాలను పెంచుతున్న 'బార్'..!

Published Mon, Aug 8 2016 1:45 PM

స్నేహ సంబంధాలను పెంచుతున్న 'బార్'..!

బ్రైటన్ః ఆధునిక కాలంలో సాంకేతికను వినియోగిస్తున్న వ్యక్తులమధ్య సన్నగిల్లుతున్న సంబంధ బాంధవ్యాలపై ఓ బార్ యాజమాన్యం దృష్టి సారించింది. సామాజిక సంబంధాలకు విఘాతం కలిగిస్తున్న సెల్ ఫోన్లను బార్ లోకి నిరాకరిస్తోంది. స్మార్ల్ ఫోన్లు స్నేహ సంబంధాలను, పబ్ లోని అనుభూతిని కూడా నాశనం చేస్తున్నాయని నమ్మిన బార్ యజమాని.. సెల్ ఫోన్ లేకుండా  ప్రాచీన పద్ధతులను అనుసరించేవారిని మాత్రమే బార్ లోనికి అనుమతిస్తున్నాడు.

ఇంగ్లాండ్  లోని బ్రైటన్లో కొత్తగా జిన్ టబ్ బార్ ప్రారంభించిన స్టీవ్ టేలర్.. వినియోగదారులకు కొత్త అనుభూతిని, అనుభవాలను కలిగించే నిర్ణయం తీసుకున్నాడు. ఆధునిక ఫ్యాషన్లను వదిలి, పాత పద్ధతులను  అనుసరించే ప్రయత్నం చేశాడు.  బార్ లోపలికి ఎంటరయ్యే ముందు సెల్ ఫోన్లు స్వీచ్చాఫ్ చేసి, రిసెప్షన్ లోనే ఉంచి వెళ్ళాలని కండిషన్ పెట్టాడు. పబ్ లో ఎంజాయ్ చేయడానికి వచ్చిన అతిథులు తమ స్నేహితులతోనూ, అక్కడివారితోనూ ఎంజాయ్ చేయకుండా.. ఇంటర్నెట్ బ్రౌజింగ్ తోనూ, ఈ మెయిల్ టెక్స్టింగ్ తోనూ కాలక్షేపం చేయడాన్ని ఆయన భరించలేకపోయాడు. దీంతో బార్ కు వచ్చినవారు సెల్ ఫోన్ వాడకూడదన్న కొత్త నిబంధనను అమల్లోకి తెచ్చాడు. బార్ లోని సీలింగ్ పై ప్రత్యేకంగా రిసెప్షన్ ఏర్పాటు చేసి, అక్కడే బ్రిటన్ వైర్లెస్ టెలిగ్రఫీ యాక్ట్ 2006 ప్రకారం చట్టబద్ధమైన  సిగ్నల్ బ్లాకర్స్ ను ఏర్పాటు చేశాడు. మనం సామాజికంగా వ్యవహరిస్తే మనకు సోషల్ మీడియాతో అవసరమే లేదంటున్న టైలర్.. బార్ లో  ఓ పాత తరహా 19వ శతాబ్దపు ల్యాండ్ లైన్, రోటరీ ఫోన్లను ప్రతి టేబుల్ మీదా అందుబాటులో ఉంచాడు. వినియోగదారులు అత్యవసరంలో ఇతరులతో మాట్లాడేందుకు, బార్ లో డ్రింక్స్ ఆర్డర్ చేసేందుకు మొబైల్ ఫోన్లను నిరోధించి, ల్యాండ్ లైన్ వినియోగించుకునే వీలు కల్పించాడు.  

చాలామంది బార్లకు వెడతారని, కానీ అక్కడ కనీసం ఫ్రెండ్స్ తో కూడా మాట్లాడకుండా, ఒంటరిగా కూర్చుని కనిపిస్తుంటారని అటువంటి పరిస్థితిని మార్చేందుకే తానీ నిర్ణయం తీసుకున్నట్లు టేలర్ చెప్తున్నాడు. సమాజంలో మనుషులు ఒకరికొకరుగా కలసి మెలసి జీవించే అవకాశం ఉందని, ఒంటరిగా ఉన్న వ్యక్తులు కూడా చుట్టుపక్కల వారితో స్నేహ సంబంధాలు పెంచుకునేందుకే ఈ పద్ధతిని ప్రవేశ పెట్టినట్లు టేలర్ వెల్లడించాడు.  22 జూలై 2016న ప్రారంభించిన జిన్ టబ్ పై ఆన్లైన్ రివ్యూలు చదివిన తర్వాత నాకెంతో ఆనందంగా ఉందని, మానవ సంబంధాలను మెరుగుపరిచే ప్రక్రియను చేపట్టడంపై ప్రజలంతా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారని, బార్ లో ఓ స్నేహపూర్వకమైన, ప్రేమపూర్వకమైన అనుభూతిని పొందగల్గుతున్నామని చెప్పడం గర్వంగా ఉందని అంటున్నాడు. మా బార్ లో ప్రతివారూ, ప్రతివారితో మాట్లాడే అవకాశం కల్పిస్తున్నామని, ఇది పాతకాలంలో బ్రిటిష్ పబ్ లను గుర్తు చేస్తుందని పబ్ యజమాని అంటున్నాడు. ఒకవేళ బార్ కు ఇద్దరు, అంతకన్నా ఎక్కువమంది వస్తే సరి... లేదంటే టేబుల్స్  షేర్ కూడా చేస్తామని, దీంతో వచ్చిన వారు బోర్ ఫీలవ్వకుండా, ఫోన్లలో సంభాషించాల్సిన అవసరం లేకుండా.. పక్కవారితో కబుర్లు చెప్పొచ్చని ఇంగ్లీష్ బార్ యజమాని అంటున్నాడు.

Advertisement

తప్పక చదవండి

Advertisement