భారత్ వస్తా.. మోదీని కలుస్తా: జుకెర్బెర్గ్ | Sakshi
Sakshi News home page

భారత్ వస్తా.. మోదీని కలుస్తా: జుకెర్బెర్గ్

Published Wed, Oct 1 2014 11:44 AM

భారత్ వస్తా.. మోదీని కలుస్తా: జుకెర్బెర్గ్ - Sakshi

సోషల్ నెట్వర్కింగ్ మార్కెట్లో నెంబర్ 2 స్థానంలో ఉన్న భారతదేశానికి తాను ఈనెలలో వస్తానని ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకెర్బెర్గ్ చెప్పారు. అలా వచ్చినప్పుడే ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కూడా కలుస్తానన్నారు. న్యూఢిల్లీలో అక్టోబర్ 9, 10 తేదీల్లో నిర్వహించే మొట్టమొదటి ఇంటర్నెట్.ఆర్గ్ సదస్సులో పాల్గొనేందుకు జుకెర్బెర్గ్ వస్తున్నారు. కేంద్ర మంత్రివర్గంలోని కొంతమంది కీలక మంత్రులను కూడా ఆయన కలుస్తారు. ఆమెరికాలో బాగా పేరున్న సీఈవోలలో జుకెర్బెర్గ్ది మూడోస్థానం. మొదటి రెండు స్థానాల్లో అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్, రెండోస్థానంలో మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ఉన్నారు. వీళ్లలో సత్యనాదెళ్ల ఇప్పటికే భారత్ వచ్చారు.

ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఇంటర్నెట్ను అందుబాటులోకి తేవాలన్న ఉద్దేశంతో ఇంటర్నెట్.ఆర్గ్ సదస్సు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు అసలు అది అందుబాటులో లేని 500 కోట్లమందికి దాన్ని అందించాలన్నది సదస్సు ప్రధాన ఉద్దేశం. ఈ సదస్సులో ఫేస్బుక్, ఎరిక్సన్, మీడియా టెక్, నోకియా, ఒపెరా, క్వాల్కామ్, శామ్సంగ్ లాంటి దిగ్గజ సంస్థలు పాల్గొంటాయి.

Advertisement

తప్పక చదవండి

Advertisement