సోషల్ మీడియా సంచలనం.. | Sakshi
Sakshi News home page

సోషల్ మీడియా సంచలనం..

Published Thu, Oct 6 2016 8:10 PM

సోషల్ మీడియా సంచలనం.. - Sakshi

బ్రిటన్ః ఆ పాపకు కేవలం ఐదేళ్ళు. కానీ ఇప్పుడామె ఇంటర్నెట్ సంచలనంగా మారింది. వీధుల్లో ఇళ్ళు లేని నిరుపేదలను చూసి చలించిపోయిన ఆ చిన్నారి.. ఏకంగా బ్రిటన్ ప్రధానికే లేఖ రాసింది. అలా రాసిన లేఖను తానే చదువుతూ రికార్డు చేసిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

వీధుల్లో తన కంటపడిన దృశ్యాలను తట్టుకోలేకపోయిన ఐదేళ్ళ చిన్నారి.. బ్రిటన్ ప్రధానికి నేరుగా లేఖ రాసింది.  డియర్ ప్రైమ్ మినిస్టర్.. థ్రేసా మే అంటూ మొదలైన ఆ లేఖలో నా పేరు బ్రూక్ బ్లెయిర్ అని, నాకు ఐదేళ్ళని చెప్పింది. తమ ప్రాంతంలోని నిరాశ్రయుల కష్టాలను థ్రెసా మే ఓసారి వచ్చి ప్రత్యక్షంగా చూడాలని కోరింది. వందలుగా ఉన్న అభాగ్యుల కష్టాలను ఎవరు తీరుస్తారు? వారికి మీరే వచ్చి చాక్లెట్లు, బిస్కెట్లు, శాండ్ విచ్ లు ఇచ్చి రక్షించాలి. అలాగే ఇళ్ళు కూడా కట్టివ్వాలి అంటూ ఆదేశించింది. నేనేమో చిన్న పిల్లని, నేనెలాంటి సహాయం చేయలేకపోతున్నాను. నాదగ్గర అంత డబ్బు కూడా లేదు. నేను దాచుకున్న డబ్బుతో వారి అవసరాలు తీరవు. అందుకే మీరు వచ్చి వారి కష్టాన్ని కళ్ళారా చూసి ఆదుకోమంటూ బ్రిటన్ ప్రధానిని కోరింది. ఇలా ఆ చిన్నారి రాసిన లేఖ వీడియో ఒక్క రోజులోనే ఇంటర్నెట్ సంచలనంగా మారింది. ఫేస్ బుక్ లో మిలియన్లకొద్దీ జనం వీక్షించడంతో ఆ చిన్నారి రాత్రికి రాత్రే సెలబ్రిటీ అయిపోయింది.

తమ నగరంలోని కోవెంటీ సిరేనియన్ ప్రజలకు మీరే సహాయం అందించాలంటూ బ్రూక్.. ప్రధానిని స్వచ్ఛందంగా ఆహ్వానించింది. నిరాశ్రయలకు అండగా నిలవాలనే ఉద్దేశ్యంతో ఆమె తల్లి మాథ్యూస్ చిన్నారి వీడియోను చిత్రీకరించి ఇంటర్నెట్ లో పోస్ట్ చేసింది. ఫేస్ బుక్ లో సెలబ్రిటీగా మారిపోయిన బ్రూక్..  వీధుల్లోని నిరాశ్రయులను కలసి వారితో సంభాషించింది. కోవెంట్రీ వీధుల్లో ప్రజలను చూసి ఎంతో బాధ కలిగిందని, నేను ఇంట్లో వెచ్చగా కూర్చుని, వారలా రోడ్లపై బతకడం విచారాన్ని కలిగిస్తోందంటూ ఆందోళన వ్యక్తం చేసింది. కోవెంట్రీ జనం కూడ చిన్నారి మాటలకు ఆశ్చర్యపోయారు. ఐదేళ్ళ చిన్నారికి కనిపించిన బాధలు, దేశ ప్రధానికి ఎందుకు కనిపించవంటూ ప్రశ్నించారు. నిజంగా ఐదేళ్ళ వయసులో సమస్యను గుర్తించి ప్రభుత్వాన్ని ప్రశ్నించడం అద్భుతమంటూ కోవెంట్రీ సిరేనియన్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మైకేల్ అన్నారు. ఈ నేపథ్యంలో బ్రూక్ విషయం తెలుసుకున్న స్థానిక ప్రభుత్వ ప్రతినిథి ఒకరు స్పందించారు. ప్రభుత్వం కేవలం కొందరికోసం కాక, అందరికోసం పనిచేస్తుందని భరోసా ఇచ్చారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement