ఐఫోన్‌ను అన్‌లాక్‌ చేసినందుకు రూ. 8 కోట్లు! | Sakshi
Sakshi News home page

ఐఫోన్‌ను అన్‌లాక్‌ చేసినందుకు రూ. 8 కోట్లు!

Published Fri, Apr 22 2016 5:18 PM

ఐఫోన్‌ను అన్‌లాక్‌ చేసినందుకు రూ. 8 కోట్లు! - Sakshi

వాషింగ్టన్‌: సాన్‌ బెర్నార్డినోలో కాల్పులు జరిపిన ఉగ్రవాది ఐఫోన్‌ను అన్‌లాక్‌ చేసేందుకు అమెరికా దర్యాప్తు సంస్థ (ఎఫ్‌బీఐ) అక్షరాల 1.3 మిలియన్‌ డాలర్ల (రూ. 8.64 కోట్ల)కుపైగా హ్యాకర్లకు చెల్లించింది. లండన్‌లోని అస్పెన్‌ సెక్యూరిటీ ఫోరమ్‌కు ఎఫ్‌బీఐ డైరెక్టర్ జేమ్స్ కోమె ఈ విషయాన్ని తెలిపారు. ఉగ్రవాది సయెద్ ఫరూఖ్‌ వాడిన ఐఫోన్‌ 5సీని అన్‌లాక్‌ చేసేందుకు రానున్న ఏడేళ్లలో తనకు అందే వేతనానికి పైగా హ్యాకర్లకు చెల్లించినట్టు ఆయన చెప్పారు. 14,900 డాలర్ల వేతనం చొప్పున ఆయన ఏడేళ్ల సర్వీసు ముగిసేలోపు మొత్తంగా 1.3 మిలియన్ డాలర్లకు పైగా అందుకుంటారు. ఈ వ్యవహారంలో అంతకన్నా ఎక్కువే హ్యాకర్లకు ఎఫ్‌బీఐ ముట్టజెప్పిందని, కానీ కేసు తీవ్రతను బట్టి ఇది అవసరమేనని కొమే అభిప్రాయపడ్డారు.

గత ఏడాది డిసెంబర్‌ 2న సాన్‌బెర్నార్డినోలో 14 మందిని ఐఎస్ఐఎస్ సానుభూతిపరుడు సయెద్ ఫరుఖ్, అతని భార్య హతమార్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పోలీసుల కాల్పుల్లో ఈ ఇద్దరు చనిపోయారు. ఈ నేపథ్యంలో అతని ఐఫోన్‌ 5సీని అన్‌లాక్‌ చేసే వ్యవహారంలో యాపిల్‌ సంస్థను ఎఫ్‌బీఐ కోర్టుకు ఈడ్బిన సంగతి తెలిసిందే. అయితే, వినియోగదారుల ప్రైవసీని ప్రమాదంలో పడేసేవిధంగా ఎట్టి పరిస్థితుల్లో దొంగదారిలో ఐఫోన్‌ను అన్‌లాక్‌ చేయబోమని యాపిల్‌ తేల్చి చెప్పడంతో ఎఫ్‌బీఐ ప్రైవేటు హ్యాకర్లను సంప్రదించి.. ఈ ఐఫోన్‌ను అన్‌లాక్ చేయించింది. ఇందుకు ఏకంగా రూ. 8 కోట్ల(1.3 మిలియన్ డాలర్ల)కుపైగా ఖర్చు చేసినట్టు ఎఫ్‌బీఐ చెప్తోంది.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement