అమెరికాలో పోలీసులపై కాల్పులు | Sakshi
Sakshi News home page

అమెరికాలో పోలీసులపై కాల్పులు

Published Sat, Jul 9 2016 1:05 AM

అమెరికాలో పోలీసులపై కాల్పులు - Sakshi

- ఐదుగురు పోలీసుల మృతి.. ఏడుగురికి గాయాలు
ప్రధాన నిందితుడి హతం
- హింసాత్మకంగా నల్లజాతీయుల  నిరసన
 
 హ్యూస్టన్ : అమెరికాలోని డాలస్ నగరంలో ఇద్దరు నల్లజాతీయులు జరిపిన కాల్పుల్లో ఐదుగురు పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు పోలీసులతో పాటు ఓ పౌరుడు తీవ్రంగా గాయపడ్డారు. డాలస్‌లోని అత్యంత రద్దీగా ఉండే డౌన్‌టౌన్ ప్రాంతంలో నల్లజాతీయులు నిరసన ప్రదర్శన సందర్భంగా దుండగులు ఈ కాల్పులకు తెగబడ్డారు. ఈ వారంలో లూసియానా, మిన్నోసోటా పోలీసు కాల్పుల్లో నల్లజాతీయుల మృతికి నిరసనగా మొదలైన నిరసనలు చివరకు రక్తపాతానికి దారితీశాయి.  9/11 దాడుల అనంతరం పోలీసులపై జరిగిన అతి పెద్ద దాడుల్లో ఒకటిగా దీన్ని పరిగణిస్తున్నారు. ఈ కాల్పుల ప్రధాన సూత్రధారి మిఖా జాన్సన్(25) రోబో సాయంతో జరిపిన పేలుళ్లలో మరణించాడు.

 తుపాకులతో దుండగులు కాల్పులు జరపడం వల్లే ఇది జరిగిందని డాలస్ పోలీస్ చీఫ్ డేవిడ్ బ్రౌన్ చెప్పారు. అయితే ఎంత మంది కాల్పులు జరపారన్నది మాత్రం స్పష్టంగా తెలియలేదు. చనిపోయే మందు అనుమానితుడు పోలీసులతో మాట్లాడుతూ... ఇటీవల నల్ల జాతీయులపై కాల్పుల వల్ల తాను తీవ్రంగా కలత చెందానని, అందుకే తెల్లజాతి అధికారుల్ని చంపాలనుకున్నానని, తాను ఏ గ్రూపు చెందినవాడిని కానని, సొంతంగానే ఈ కాల్పులకు పాల్పడినట్లు తెలిపాడు. ‘నిరసనల సందర్భంగా గురువారం రాత్రి డాలస్‌లోని డౌన్‌టౌన్ ప్రాంతంలో ఇద్దరు నల్లజాతీయులు ఆకస్మాత్తుగా పోలీసులపై కాల్పులు జరిపారు.

పోలీసులు దాన్ని ఉగ్రవాద చర్యగా మొదట పొరపడ్డారు. కాల్పులతో వందలాది మంది ప్రజలు భయంతో రోడ్లపై పరుగులు పెట్టారు. ఇంతలో పోలీసులు ఒక అనుమానితుడ్ని చుట్టుముట్టి చాలా సేపు అతనితో చర్చలు జరిపారు. చర్చలు ఫలించపోవడంతో దుండగుడికి, పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. చివరకు పోలీసులు రోబోకు పేలుడు పదార్థం అమర్చి దుండగుడి వద్దకు చేర్చి పేల్చి వేశారు.’ అని పోలీసు చీఫ్ బ్రౌన్ తెలిపారు. ఇంకా అనుమానితులు చాలా మంది ఉండే అవకాశం ఉందని, అనుమానితులంతా కలసి పనిచేస్తున్నారని, దీంతో దర్యాప్తు అధికారులు జాగ్రత్తగా ముందుకు వెళుతున్నారని ఆయన చెప్పారు.

 ఒబామా తీవ్ర ఆందోళన..
 మరోవైపు అమెరికాలో వరుస కాల్పుల ఘటనలపై అధ్యక్షుడు ఒబామా ఆందోళన వ్యక్తం చేశారు. నాటో సదస్సు కోసం పోలండ్‌లో ఉన్న ఒబామా పోలీసులపై జరిగిన దాడి అత్యంత హేయమైనదిగా పేర్కొన్నారు. ఈ సంఘటనలతో మనం తీవ్రంగా భీతిచెందామని, ప్రజలు, పోలీసులతో మనం కలిసికట్టుగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

Advertisement
Advertisement