Sakshi News home page

ఫారెస్ట్‌ బేతింగ్‌తో సంపూర్ణ ఆరోగ్యం

Published Thu, May 11 2017 5:18 PM

ఫారెస్ట్‌ బేతింగ్‌తో సంపూర్ణ ఆరోగ్యం - Sakshi

పచ్చని చెట్ల కింద నడిచినా, పరుగెత్తినా, సేదతీరినా ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటుంది. కాలుష్యాన్ని పీల్చుకొని చెట్లు ప్రాణవాయువు ఆక్సిజన్‌ను వదలడమే అందుకు కారణమని శాస్త్రవేత్తలు ఎప్పటి నుంచో చెబుతున్నారు. వాస్తవానికి పచ్చటి చెట్లతో ఆక్సిజన్‌ ప్రయోజనం ఒక్కటే కాదు. మన ఆరోగ్యానికి, మానసిక ఉల్లాసానికి  తోడ్పడే ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. చెట్ల కింద గడిపితే మనుషుల బీపీ అదుపులో ఉంటుంది. మానసిక ఒత్తిడి దూరమవుతుంది. జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. రోగ నిరోధకశక్తి పెరుగుతుంది. మానవుడికి కావాల్సిన సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది.

భారతీయులకు ఆయుర్వేదం రూపంలో ప్రకృతి చికిత్స ఎప్పటి నుంచో అందుబాటులో ఉన్నట్టే జపనీయులకు ఎకో థెరపీ అందుబాటులో ఉంది. ఎకోథెరపీ అంటే పచ్చనిచెట్ల మధ్య గడపడం. దీన్ని జపనీయులు ‘ఫారెస్ట్‌ బేతింగ్‌’ అని కూడా పిలుస్తారు. ఇది దాదాపు 150 ఏళ్ల క్రితం నుంచి అంటే, 1854 నుంచే అమల్లో ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయి. ఈ ఫారెస్ట్‌ బేతింగ్‌ను జపాన్‌ ప్రభుత్వం 1982 నుంచి తమ ‘జాతీయ ప్రభుత్వ వైద్య కార్యక్రమం’లో భాగం చేసింది. చెట్లకు, మనుషుల ఆరోగ్యానికి ఉన్న సంబంధం ఏమిటో ఇంతకాలానికి పరిశోధకులు కనుగొనగలిగారు.

చెట్ల మధ్య నుంచి వచ్చే గాలిలో కాలుష్యం లేకపోవడమే కాకుండా ‘పైటోన్‌సైడ్‌’ అనే రసాయన మిశ్రమం ఉంటుంది. బ్యాక్టీరియా, క్రిములు దగ్గరికి రాకుండా తమను తాము రక్షించుకునేందుకు చెట్లు పైటోన్‌సైడ్‌ను విడుదల చేస్తాయి. దాన్ని మనుషులు పీల్చుకోవడం వల్ల రోగనిరోధక శక్తి అభివృద్ధి చెందుతుంది. మానవ శరీరంలోని కణాలు బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్లకు గురైనప్పుడు ఆ బ్యాక్టీరియాను చంపేసేందుకు కొన్ని కణాలు పోరాటం చేస్తాయి. వాటిని ‘నేచురల్‌ కిల్లర్స్‌’ అని కూడా వ్యవహరిస్తారు. అడవికి బయట ఉన్నప్పుటి కంటే మనుషులు అడవిలో ఉన్నప్పుడు వారిలోని నేచురల్‌ కిల్లర్స్‌ క్రియాశీలకంగా పనిచేస్తున్నట్లు కూడా పరిశోధనల్లో తేలింది. క్యాన్సర్‌ లాంటి ట్యూమర్లు ఏర్పడకుండా కూడా ఈ సెల్స్‌ పనిచేస్తాయి.

2004 - 2012 మధ్య జపాన్‌ వైద్యాధికారులు 40 లక్షల డాలర్లను వెచ్చించి మానవుల ఆరోగ్యంపైన, మనస్సుపైన ఫారెస్ట్‌ బేతింగ్‌ ఎలాంటి ప్రభావం చూపిస్తుందన్న అంశంపై విస్త్రృత అధ్యయనాలు జరిపారు. వారు ఈ అధ్యయనంలో భాగంగా 48 థెరపీ ట్రయల్స్‌ను జరిపారు. అడవిలో కనీసం రెండు గంటలు తగ్గకుండా ఉన్నప్పుడే ప్రయోజనం కలుగుతుందని వారి ట్రయల్స్‌లో తేలింది. నడక సాగించడమో, పరుగెత్తడమో చేయాల్సిన అవసరం కూడా లేదని, చెట్ల కింద విశ్రాంతి తీసుకుంటూ గుండెల నిండా స్వచ్ఛమైన అక్కడి గాలి పీల్చుకుంటే చాలని కూడా వారి అధ్యయనాల్లో తేలింది. మొక్కలు బ్యాక్టీరియా నుంచి, క్రిముల నుంచి తమను తాము రక్షించుకోవడానికి విడుదల చేస్తున్న ‘పైటోన్‌సైడ్‌’ వల్లనే మనుషుల్లో రోగ నిరోధక శక్తి పెరుగుతుందన్నది తాజా పరిశోధనల సారాంశం.

ఇప్పుడు ఫారెస్ట్‌ థెరపీ అమెరికాలోని కాలిఫోర్నియాలో కూడా విస్తరించింది. ఇప్పుడక్కడ ప్రభుత్వ గుర్తింపు పొందిన ఫారెస్ట్‌ బేతింగ్‌ గైడ్‌లు కూడా ఉన్నారు. కాంక్రీట్‌ జంగిల్లో బతుకుతున్న ప్రజలు వారాంతంలో ఆరోగ్యం కోసం అడవుల దారులు పట్టడం మంచిది.

Advertisement

What’s your opinion

Advertisement