Sakshi News home page

రిసార్ట్‌గా మారనున్న కాన్‌సెంట్రేషన్ క్యాంప్

Published Thu, Jan 21 2016 7:17 PM

రిసార్ట్‌గా మారనున్న కాన్‌సెంట్రేషన్ క్యాంప్ - Sakshi

పోడ్కోరికా:  రెండో ప్రపంచ యుద్ధం కాలంనాటి ‘కాన్‌సెంట్రేషన్’ క్యాంప్ గల మోంటోనిగ్రొ తీరంలోని మాముల దీవిని ఇప్పుడు అందమైన లగ్జరీ రిసార్ట్‌గా అభివృద్ధి చేయాలని మోంటోనిగ్రొ ప్రభుత్వం నిర్ణయించింది. ఇటలీకి చెందిన అప్పటి నాజీ నియంత బెనిటో ముస్సోలిని శత్రు ఖైదీలను  నిర్భంధించేందుకు మాముల దీవిలో ‘కాన్‌సెంట్రేషన్’ క్యాంప్‌ను ఏర్పాటు చేశారు.

ఈ క్యాంప్‌లో 2,300 మంది ఖైదీలను నిర్బంధించగా వారిలో 130 మంది ఆకలితో చనిపోవడంగానీ, చంపేయడంగానీ జరిగింది. చారిత్రక గుర్తుగా ఈ దీవిని అలాగే ఉంచాలంటూ స్థానిక ప్రజలతోపాటు పలు ప్రపంచ దేశాలు చేసిన సూచనలను ఖాతరు చేయకుండా అక్కడ సుందరమైన రిసార్ట్‌ను నిర్మించి ప్రపంచ పర్యాటకులను ఆకర్షించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రిసార్ట్‌ను నిర్మించేందుకు 1150 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని కూడా అంచనా వేసింది. ‘మాముల క్యాంప్’ పేరుతో 1950లో ఓ హాలివుడ్ సినిమా కూడా వచ్చింది.

మాముల దీవి దానంతట అదే శిథిలమయ్యేలా వదిలేయడం లేదా దాన్ని అందమైన పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్డడం అనే రెండే ప్రత్యామ్నాయాలు తమకు ఉన్నాయని జాతీయ పర్యాటక శాఖ డెరైక్టర్ ఆలివెరా బ్రజోవిక్ తెలిపారు. రెండో ప్రత్యామ్నాయమే ఉత్తమమైనదని భావించామని, ఎందుకంటే స్థానికుల ఆర్థిక పరిస్థితి మెరుగుపడేందుకు ఇది దోహదపడుతుందని ఆయన వివరించారు.

ఈ కాన్‌స్ట్రేషన్ క్యాంప్‌లో స్థానికులే ఎక్కువ మంది మరణించడం వల్ల రిసార్ట్‌గా తీర్చిదిద్దడం వారికి ఇష్టం లేదు. క్యాంప్‌ను మ్యూజియంగానే ఉంచడం ఉత్తమమన్నది వారి వాదన. వారి వాదనకు తగ్గట్టుగా అవసరమైతే క్యాంప్ ఉన్న ప్రాంతంలో ఓ మ్యూజియం ఏర్పాటు చేస్తామని ఆలివెరా అన్నారు.  రిసార్ట్ నిర్మాణం కోసం స్విస్-ఈజిప్షియన్ కంపెనీ ‘ఓరస్కామ్’కు ఈ దీవిని 49 ఏళ్ల పాటు లీజుకు ఇచ్చారు. చదరపు మీటరుకు 150 రూపాయల చొప్పున ఈ కంపెనీ లీజు దక్కించుకుంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement