ఐఎస్‌ఐఎస్‌లో చేరాలని వెళ్లి సిరియాలో చిక్కారు! | Sakshi
Sakshi News home page

ఐఎస్‌ఐఎస్‌లో చేరాలని వెళ్లి సిరియాలో చిక్కారు!

Published Thu, Jan 14 2016 12:09 PM

ఐఎస్‌ఐఎస్‌లో చేరాలని వెళ్లి సిరియాలో చిక్కారు!

న్యూఢిల్లీ: ఐఎస్ఐఎస్‌ ఉగ్రవాద గ్రూప్‌లో చేరేందుకు వెళ్లిన నలుగురు భారతీయ యువకులను సిరియా ప్రభుత్వం తన కస్టడీలోకి తీసుకుంది. వీరి గురించి భారత్‌కు సమాచారం అందించి.. వీరి వివరాలు ధ్రువీకరించాల్సిందిగా కోరింది. ప్రస్తుతం మూడురోజుల భారతదేశ పర్యటనలో ఉన్న సిరియా ఉప ప్రధానమంత్రి వాలిద్ అల్ మౌలెం ఈ విషయాన్ని వెల్లడించారు. నలుగురు భారతీయ యువకులు ఇస్లామిక్ స్టేట్‌ ఉగ్రవాద గ్రూప్‌లో చేరేందుకు సిరియాలో అడుగుపెట్టారని, అనుమానాస్పదంగా కనిపించిన వారిని సిరియా భద్రతా దళాలు డమస్కస్‌లో అదుపులోకి తీసుకున్నాయని వివరించారు. అయితే వీరిని ఎప్పుడు అదుపులోకి తీసుకున్నారు. వీరి వివరాలేమిటి అన్న విషయాన్ని తెలియజేయలేదు.

ఇస్లామిక్ స్టేట్‌ ఉగ్రవాద గ్రూప్‌ వైపు ఇటీవల భారతీయ యువత ఆకర్షితులవుతున్నట్టు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో వారిని నిరోధించేందుకు భారత భద్రతా సంస్థలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే గత డిసెంబర్‌లో ఐఎస్ఐఎస్‌లో చేరేందుకు వెళ్తున్న ముగ్గురు యువకులను నాగ్‌పూర్ విమానాశ్రయంలో పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా సిరియాలో కూడా మరో నలుగురిని అదుపులోకి తీసుకోవడం ఈ విషయంలో భారత్‌ తీసుకుంటున్న చర్యలను చాటుతున్నాయి.
 

Advertisement
Advertisement