రూ. 12వేల కోట్ల పన్ను ఎగ్గొట్టిన గూగుల్? | Sakshi
Sakshi News home page

రూ. 12వేల కోట్ల పన్ను ఎగ్గొట్టిన గూగుల్?

Published Tue, May 24 2016 6:29 PM

రూ. 12వేల కోట్ల పన్ను ఎగ్గొట్టిన గూగుల్?

ఫ్రాన్స్‌లోని సంస్థ కార్యాలయంలో పోలీసు సోదాలు
ఆదాయాన్ని వేరే దేశాలకు మళ్లిస్తున్నట్లు ఆరోపణలు


ప్యారిస్
పన్నుల ఎగవేత కుంభకోణానికి సంబంధించిన కేసులో గూగుల్ కార్యాలయంలో ఫ్రెంచి పోలీసులు సోదాలు చేశారు. ఫ్రాన్సులో గూగుల్ సంస్థ దాదాపు రూ. 12వేల కోట్ల మేర పన్నులు చెల్లించలేదని అధికారులు భావిస్తున్నారు. తమ ఆర్థిక వ్యవహారాలను అత్యంత సంక్లిష్టంగా మార్చుకుని, ఒక దేశంలో ఆదాయాలను వేరే దేశంలో వచ్చినట్లు చూపించడం ద్వారా చాలా తక్కువ మొత్తంలోనే పన్నులు కడుతున్న పలు బహుళజాతి కంపెనీలలో గూగుల్ కూడా ఒకటన్నది అక్కడి అధికారుల ఆరోపణ. యూరప్‌లో గూగుల్ ప్రధాన కార్యాలయం ఐర్లండ్‌లో ఉంది. అక్కడ కార్పొరేట్ పన్నురేట్లు చాలా తక్కువగా ఉండటమే అందుకు కారణం.

ఫ్రాన్సు కాలమానం ప్రకారం తెల్లవారుజామున 5 గంటల నుంచి (భారత కాలమానం ప్రకారం ఉదయం 8.30) సుమారు వంద మంది అధికారులు గూగుల్ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. ఇంతకుముందు 2011లో కూడా ఒకసారి ఫ్రెంచి అధికారులు గూగుల్ కార్యాలయంపై దాడి చేశారు. అప్పట్లో ఐర్లండ్‌లోని తమ ప్రధాన కార్యాలయానికి నిధులు బదిలీ చేశారన్న ఆరోపణలు వచ్చాయి. జనవరిలో బ్రిటన్‌కు రూ. 1286 కోట్ల పన్ను బకాయిలు చెల్లించేందుకు గూగుల్ అంగీకరించింది. ఇది తీవ్ర విమర్శలకు దారితీసింది. అయితే, బ్రిటన్‌ కంటే ఫ్రాన్సులో ఆ సంస్థ పెట్టుబడులు చాలా ఎక్కువ మొత్తంలో ఉన్నట్లు ఫ్రాన్స్ మంత్రి మైఖేల్ సాపిన్ ఫిబ్రవరిలో వ్యాఖ్యానించారు.

Advertisement
Advertisement