గ్లోబల్ శాటిలైట్కు కలాం పేరు! | Sakshi
Sakshi News home page

గ్లోబల్ శాటిలైట్కు కలాం పేరు!

Published Fri, Aug 7 2015 3:35 PM

గ్లోబల్ శాటిలైట్కు కలాం పేరు! - Sakshi

బెంగళూరు: మాజీ రాష్ట్రపతి, ప్రఖ్యాత శాస్త్రవేత్త ఏపీజే అబ్దుల్ కలాంకు అరుదైన గౌరవం దక్కనుంది. ఓ గ్లోబల్ శాటిలైట్కు అబ్దుల్ కలాం పేరు పెట్టనున్నారు. భూమి పరిశీలన, విపత్తుల నష్టాలను తగ్గించడం కోసం ఐక్యరాజ్యసమితి సహకారంతో రూపొందించే 'గ్లోబల్శాట్ ఫర్ డీఆర్ఆర్'కు కలాం పేరు పెట్టాలని ప్రతిపాదించారు. స్పేస్ టెక్నాలజీ ఫర్ సొసైటల్ అప్లికేషన్స్ సంస్ధ కెనడా-యూరప్-యూఎస్-ఆసియా (సీఏఎన్ఈయూఎస్) చైర్మన్ మిలింద్ పిమ్ప్రికర్ ఈ విషయాన్ని వెల్లడించారు. అబ్దుల్ కలాం గౌరవార్థం ఈ శాటిలైట్కు 'యూఎన్ కలాం గ్లోబల్శాట్'గా పేరు మార్చాలని ప్రతిపాదించినట్టు పిమ్ప్రికర్ చెప్పారు.

జూలై 27న అబ్దుల్ కలాం షిల్లాంగ్లో తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. గ్లోబల్ శాటిలైట్కు కలాం పేరు పెట్టడానికి ఐక్యరాజ్యసమితి సమావేశంలో అధికారికంగా ఆమోదించాల్సివుంది. సెప్టెంబర్లో న్యూయార్క్లో జరిగే ఈ కాన్ఫరెన్స్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ సహా 150కి పైగా దేశాధినేతలు హాజరవుతారు. స్పేస్ టెక్నాలజీని ఉపయోగించుకుని ప్రపంచంలో విపత్తుల నష్టాలను తగ్గించడమే లక్ష్యంగా 1999లో కెనడాలోని మాంట్రియల్ ప్రధాన కేంద్రంగా  సీఏఎన్ఈయూఎస్ను ఏర్పాటు చేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement