భారతీయుల ‘గ్రీన్‌కార్డు’ ఆశలపై నీళ్లు? | Sakshi
Sakshi News home page

భారతీయుల ‘గ్రీన్‌కార్డు’ ఆశలపై నీళ్లు?

Published Thu, Feb 9 2017 1:34 AM

భారతీయుల ‘గ్రీన్‌కార్డు’ ఆశలపై నీళ్లు? - Sakshi

అమెరికన్‌ కాంగ్రెస్‌లో బిల్లు
ఇప్పటికే అమెరికా హెచ్‌1బీ వీసాలను తగ్గించేలా కార్యనిర్వాహక ఆదేశాలు సిద్ధమవుతుంటే.. ఇప్పుడు భారత అమెరికన్లకు తీవ్ర ప్రభావం చూపేలా గ్రీన్‌కార్డుల సంఖ్యను సగానికి తగ్గించే బిల్లును ట్రంప్‌ ప్రభుత్వం కాంగ్రెస్‌లో ప్రవేశపెట్టింది.    

 వాషింగ్టన్‌: స్థానికులకే ఉద్యోగావకాశాలను పెంచే దిశగా కఠినమైన నిర్ణయాలతో ముందుకెళ్తున్న అమెరికా మరో పిడుగులాంటి ప్రతిపాదనను కాంగ్రెస్‌లో ప్రవేశపెట్టింది. ఇప్పటికే హెచ్‌1బీ వీసాలను తగ్గించేలా కార్యనిర్వాహక ఆదేశాలు సిద్ధమవుతుంటే.. ఇప్పుడు భారత అమెరికన్లకు తీవ్ర ప్రభావం చూపేలా గ్రీన్‌కార్డు (అమెరికాలో శాశ్వత నివాసం ఏర్పర్చుకునే)ల సంఖ్యను సగానికి తగ్గించే బిల్లును కాంగ్రెస్‌లో ప్రవేశపెట్టింది. అమెరికాలోకి వస్తున్న వలసలను పదేళ్లలో సగానికి తగ్గించే ఉద్దేశంతో రూపొందించిన రైజ్‌ (ద రిఫార్మింగ్‌ అమెరికన్‌ ఇమిగ్రేషన్‌ ఫర్‌ స్ట్రాంగ్‌ ఎంప్లాయ్‌మెంట్‌) బిల్లును డెమొక్రటిక్‌ ఎంపీ టామ్‌ కాటన్, రిపబ్లికన్‌ ఎంపీ డేవిడ్‌ పర్‌డ్యూలు అమెరికన్‌ కాంగ్రెస్‌లో ప్రవేశపెట్టారు.

దీని కారణంగా గ్రీన్‌ కార్డులు పొందాలనుకుంటున్న వారి ఆశలు గల్లంతయ్యే అవకాశాలున్నాయి. ఈ బిల్లు ద్వారా అమెరికా వలసల వ్యవస్థలో సమూల మార్పులు తెచ్చి.. నైపుణ్య వీసా (స్కిల్‌ బేస్డ్‌ వీసా) లేని విదేశీయులను దేశంలోకి రాకుండా నియంత్రించవచ్చు. ప్రస్తుతం ఏడాదికి పదిలక్షల మందికి గ్రీన్‌ కార్డులు ఇస్తుండగా.. దాన్ని ఐదు లక్షలకు తగ్గించే ఉద్దేశంతోనే ఈ బిల్లును రూపొందించినట్లు దీన్ని ప్రవేశపెట్టిన డెమొక్రటిక్‌ పార్టీ సభ్యులు టామ్‌ కాటన్, డేవిడ్‌ పర్‌డ్యూ వెల్లడించారు. ‘వలసల విధానం అమెరికన్‌ ఉద్యోగుల కోసం పనిచేయాల్సిన సమయం ఆసన్నమైంది’ అని కాటన్‌ తెలిపారు.

ఈ చట్టం అమల్లోకి వస్తే.. చాలాకాలంగా గ్రీన్‌కార్డుల కోసం ఎదురుచూస్తున్న భారత అమెరికన్ల ఆశలు నీరుగారినట్లే. ప్రస్తుతం అమెరికాలోని భారతీయులు గ్రీన్‌కార్డు పొందేందుకు కనీసం పదేళ్లు (గరిష్టంగా 35 ఏళ్లు) వేచి చూడాల్సిందే. ప్రతిపాదన అమల్లోకి వస్తే ఈ కాలవ్యవధి మరింత పెరిగే అవకాశాలున్నాయి. హెచ్‌1బీ వీసాలతో ఈ బిల్లుకు సంబంధం లేదు.  లాటరీల ద్వారా వీసాలిచ్చే విధానానికి స్వస్తి చెప్పాలని కూడా ఈ బిల్లులో పేర్కొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement