పచ్చని అణు విద్యుత్‌ | Sakshi
Sakshi News home page

పచ్చని అణు విద్యుత్‌

Published Thu, Jul 27 2017 1:16 AM

పచ్చని అణు విద్యుత్‌ - Sakshi

ఆకాశంలో కొన్ని నిమిషాల పాటు అందమైన హరివిల్లు కనిపిస్తే... ఆహా ఎంత బాగుందీ అనుకోని వారు అస్సలుండరు. మరి.. అలాంటి రెయిన్‌బో రోజంతా.. ఏడాది పొడవునా కనిపిస్తూంటే? అదెలా సాధ్యం?! ఏడు రంగుల ఇంద్రచాపం ఏర్పడాలంటే సన్నటి జల్లులు పడుతూండాలి.. వెనుకన సూర్యుడు మందంగానైనా వెలుతురు ఇస్తూండాలి కదా అంటున్నారా? నిజమేగానీ.. ఇలాంటివేవీ లేకుండానే ఇంకో ఏడేళ్లలో బ్రిటన్‌లోని మూర్‌సైడ్‌ అణువిద్యుత్‌ కేంద్రం వద్ద రెయిన్‌బో నిత్యం కనిపిస్తుంది! ఫొటోలో ఉందే... అలాగన్నమాట! విషయం ఏమిటంటే.. బ్రిటన్‌లోని కంబ్రియా ప్రాంతంలో కొత్తగా ఓ అణువిద్యుత్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఆ ప్రాంతమంతా పచ్చటి పచ్చికబయళ్లతో అందంగా ఉంది. ప్లాంట్‌ కోసం ఈ పచ్చదనాన్ని ఎందుకు పాడుచేయాలి అన్న సంశయంతో నిర్వాహకులు ఓ పోటీకి పిలుపునిచ్చారు.

ప్లాంట్‌ ఉన్నచోట ఉన్న పచ్చదనాన్ని కాపాడుతూనే దానిని ఓ అందమైన ల్యాండ్‌ స్కేపింగ్‌గా కూడా చేయాలన్నది పోటీ ఉద్దేశం. వన్‌ క్రియేటివ్‌ ఎన్విరాన్‌మెంట్స్‌ అనే సంస్థ ‘డిస్కవరీ పార్క్‌’ పేరుతో ఇచ్చిన ప్రతిపాదనే ఇప్పుడు ఫొటోలో మీరు చూస్తున్నది. ఫ్యాక్టరీకి రెండువైపులా పొడవైన గాజు గొట్టాలు పెట్టి.. కాంతి, నీటితుంపరల సాయంతో ఏడు రంగుల హరివిల్లును సృష్టిస్తామని, అది నిత్యం అలా కనిపిస్తూంటుందని వీరు ప్రతిపాదించారు. అంతేకాకుండా... ఫ్యాక్టరీ మొత్తాన్నీ లక్షల టన్నుల మట్టితో కప్పేసి..  దానిపై పచ్చిక బయలును ఏర్పాటు చేస్తామని సూచించారు. మొత్తం ప్రాంతాన్ని పై నుంచి చూస్తే.. ఓ అణువు విడిపోతున్నట్లుగా ఉంటుందని చెప్పారు. ఇంకేముంది.. ఈ పోటీకి పిలుపునిచ్చిన రాయల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్రిటిష్‌ ఆర్కిటెక్ట్స్, ల్యాండ్‌స్కేప్‌ ఇన్‌స్టిట్యూట్‌లు ఈ డిజైన్‌తోపాటు.. మరో నాలుగింటిని ఎంపిక చేశాయి. రెండో దశలోనూ ఈ డిజైనే ఎంపికైతే.. ఆకాశంలో రంగుల హరివిల్లు నిత్యం కనువిందు చేస్తూంటుందన్నమాట!

Advertisement

తప్పక చదవండి

Advertisement