వాడు టెర్రరిస్టు కాదు.. వట్టి ఇడియట్‌! | Sakshi
Sakshi News home page

వాడు టెర్రరిస్టు కాదు.. వట్టి ఇడియట్‌!

Published Tue, Mar 29 2016 4:33 PM

వాడు టెర్రరిస్టు కాదు.. వట్టి ఇడియట్‌! - Sakshi

ఈజిప్టు విమానం హైజాక్‌ వ్యవహారంలో అనేక ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఈ విమానాన్ని హైజాక్‌ చేశారని వార్తలు రావడం.. ప్రపంచవ్యాప్తంగా అప్రమత్తత, ఆందోళన వ్యక్తమైంది. తీరా ఆరా తీస్తే.. సీఫ్‌ ఎల్డిన్ ముస్తాఫా అనే ఈజిప్టు వ్యక్తి  ఈ విమానాన్ని హైజాక్ చేసినట్టు తేలింది. తన మాజీ భార్యను చూసేందుకే ఈ ఘనుడు ఇంతటి డ్రామాకు తెరతీశాడు. ఆత్మాహుతి జాకెట్ ధరించిన అతడు విమాన సిబ్బందిని బెదిరించి..  సైప్రస్‌లోని లార్నాకలో బలవంతంగా ప్రైవేటు జెట్‌ విమానాన్ని దింపించాడు. ప్రస్తుతం అతని అధీనంలో 11 మంది బందీలుగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇందులో ఇద్దరు బ్రిటన్ పౌరులు, ఒక ఇటాలియన్‌, ఒక ఐరీష్ వ్యక్తి ఉన్నట్టు సమాచారం. హైజాకర్‌ సీఫ్‌ డిమాండ్ మేరకు అతని మాజీ భార్యను సీన్‌లోకి రప్పించారు అధికారులు.

మరోవైపు ఈజిప్టు విమానం హైజాక్ వ్యవహారంపై ఆ దేశ విదేశాంగ మంత్రిత్వశాఖ అగ్గిమీద గుగ్గిలంలా మారింది. హైజాక్ చేసిన వ్యక్తి ఉగ్రవాది కాదని, అతడు వట్టి మూర్ఖుడని (ఇడియట్‌), ఉగ్రవాదులు వెర్రిగా వ్యవహారిస్తారని, కానీ పిచ్చిపనులు చేయరని, కానీ వీడు చేశాడని విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది.

62 మందితో ప్రయాణిస్తున్న విమానాన్ని ఆత్మాహుతి జాకెట్‌తో బెదిరించి సీఫ్ హైజాక్‌ చేశాడు. అందులోని మహిళలు, పిల్లలను సురక్షితంగా దింపేసిన అనంతరం ఓ మహిళ సిబ్బంది ద్వారా నాలుగు పేజీల లేఖను విమానాశ్రయ అధికారులకు పంపించాడు. సైప్రస్‌లో తన మాజీ భార్యను చూసేందుకు, ఆమెతో  మాట్లాడేందుకు సీఫ్‌ ఇంతటి దుండగానికి పాల్పడినట్టు తెలుస్తోంది. ఇప్పుడు అతడి అధీనంలో ఉన్న బందీలు విడిపించి.. ఈ హైజాక్ డ్రామాకు తెరదించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.

Advertisement
Advertisement