హిల్లరీ.. అమితాబ్‌ను కలిశారా? | Sakshi
Sakshi News home page

హిల్లరీ.. అమితాబ్‌ను కలిశారా?

Published Sat, Nov 5 2016 10:20 AM

హిల్లరీ.. అమితాబ్‌ను కలిశారా? - Sakshi

మరో మూడు రోజుల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న తరుణంలో సరికొత్త విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. డెమొక్రాటిక్ పార్టీ తరఫున పోటీ పడుతున్న హిల్లరీ క్లింటన్.. కొన్నేళ్ల క్రితం బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌ను కలిసినట్లు తాజాగా లీకైన ఈ మెయిల్ ద్వారా తెలుస్తోంది. ద వాషింగ్టన్ పోస్ట్ పత్రికకు చెందిన పొలిటికల్ రిపోర్టర్ జోస్ ఎ డెల్‌రియల్ దీనికి సంబంధించి ఒక ఫొటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. పాకిస్థాన్ సంతతికి చెందిన తన సహాయకురాలు హుమా అబెదిన్‌ను ఆమె అడిగారు. 2011 జూలైలో రాసిన ఈ మెయిల్ తాజాగా బయటపడింది. ''కొన్నేళ్ల క్రితం మనం కలిసిన భారతీయ వృద్ధ నటుడి పేరేంటి'' అని ఆమె ఒక ఈ మెయిల్‌లో ప్రశ్నించగా, దానికి అబెదిన్.. ''అమితాబ్ బచ్చన్'' అని సమాధానమిచ్చారు. 
 
అయితే ఏ సందర్భంలో అమితాబ్‌ను వాళ్లు కలిశారన్న విషయం గురించిన చర్చ మాత్రం ఆ ఈమెయిల్‌లో లేదు. సరిగ్గా ఎన్నికలు ముంచుకొచ్చిన తరుణంలోనే ఈమెయిల్స్ బయటపడటం హిల్లరీకి పెద్ద తలనొప్పిగా మారింది. ఆ ఈమెయిల్స్ విషయంలో దర్యాప్తు చేయనున్నట్లు ఎఫ్‌బీఐ డైరెక్టర్ జేమ్స్ కామీ కాంగ్రెస్‌కు ఒక లేఖ రాశారు. హుబా అబెదిన్ మాజీ భర్తకు చెందిన ఒక ల్యాప్‌టాప్‌ను ఎఫ్‌బీఐ స్వాధీనం చేసుకుని, దాన్నుంచి మొత్తం 6.50 లక్షల ఈమెయిల్స్‌ను రిట్రీవ్ చేసింది. బరాక్ ఒబామా తొలిసారి అధ్యక్షుడు అయినప్పుడు ఆయన మంత్రివర్గంలో విదేశాంగ మంత్రిగా పనిచేసిన హిల్లరీ.. ప్రైవేటు ఈ మెయిల్ సర్వర్‌ను ఉపయోగించడంపై దర్యాప్తు జరగనుంది. 

Advertisement
Advertisement