హాంకాంగ్‌ ఆందోళనలు తీవ్రతరం

30 Sep, 2019 04:24 IST|Sakshi
బారికేడ్లకు నిప్పుపెట్టిన ఆందోళనకారులు

హాంకాంగ్‌: హాంకాంగ్‌లో ప్రజాస్వామ్య అనుకూలవాదుల ఆందోళనలు మరింత ఉధృతమయ్యాయి. ఆదివారం ఉదయం వేలాది మందితో చేపట్టిన ర్యాలీలో నిరసనకారులు పోలీసులతో తలపడ్డారు. ప్రదర్శనలో పాల్గొన్న వారు సబ్‌వే రైల్వే స్టేషన్లలో విధ్వంసానికి పాల్పడ్డారు. పోలీసు బారికేడ్లకు నిప్పు పెట్టారు. చైనా అవతరణ దినోత్సవం పోస్టర్లను చించివేశారు. ఆందోళనకారులు రాళ్లు, పెట్రోల్‌ బాంబులు విసరగా పోలీసులు లాఠీచార్జి చేశారు. టియర్‌ గ్యాస్‌ను, రబ్బరు బుల్లెట్లు, వాటర్‌ కెనన్లను ప్రయోగించారు.

పెద్ద సంఖ్యలో నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆందోళనకారులు ఆన్‌లైన్‌లో ఇచ్చిన పిలుపు మేరకు ఆస్ట్రేలియా, తైవాన్‌తోపాటు యూరప్, ఉత్తర అమెరికా దేశాల్లోని 40 ప్రాంతాల్లో సాయంత్రం సంఘీభావ ర్యాలీలు జరిగాయి. విద్యార్థులు నేడు సమ్మెకు పిలుపునివ్వగా ప్రజలంతా నల్ల రంగు దుస్తులు ధరించాలని వివిధ సంఘాలు కోరాయి. కమ్యూనిస్టు చైనా ప్రభుత్వం మంగళవారం నుంచి 70వ అవతరణ దినోత్సవం జరుపుకోనున్న నేపథ్యంలో అలజడులు కొనసాగుతుండటం గమనార్హం.

ఈ పరిస్థితుల్లో జాతీయ దినోత్సవాల్లో పాల్గొనేందుకు బీజింగ్‌ వెళ్లనున్నట్లు హాంకాంగ్‌ పాలకురాలు లామ్‌ ప్రకటించారు. నేర చరితులను చైనాకు అప్పగించేందుకు ఉద్దేశించిన బిల్లును వ్యతిరేకిస్తూ ప్రారంభమైన నిరసనలు నాలుగు నెలలుగా కొనసాగుతూనే ఉన్నాయి. బ్రిటన్‌ నుంచి చైనా ప్రధాన భూభాగంలో కలిసే సమయంలో ఇచ్చిన హామీ మేరకు 2047 వరకు హాంకాంగ్‌లో వారికి స్వతంత్ర న్యాయవ్యవస్థ, వాక్‌ స్వాతంత్య్రం హక్కు కల్పించారు. అయితే, చైనా ప్రభుత్వం ఇప్పటికే వాటిని దూరం చేసిందని హాంకాంగ్‌ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా