అవకాశాల గడ్డ భారత్‌! | Sakshi
Sakshi News home page

అవకాశాల గడ్డ భారత్‌!

Published Sun, Nov 20 2016 10:41 PM

అవకాశాల గడ్డ భారత్‌!

సద్వినియోగం చేసుకోవాలని యువతకు శ్రీకాంత్‌ బొల్ల పిలుపు  
లాస్‌ఏంజిలెస్‌‌: భవిష్యత్తును ఉజ్వలంగా తీర్చిదిద్దుకునేందుకు తపించే యువతకు భారత్‌ సరైన వేదిక అని బొల్లాంట్‌ ఇండస్ట్రీస్‌ సీఈవో శ్రీకాంత్‌ బొల్ల అన్నారు. అమెరికా వంటి దేశాలే కాదు.. భారత్‌ కూడా ఇప్పుడు అవకాశాల గడ్డగా మారిందన్నారు. వరల్డ్‌ హిందూ ఎకనమిక్‌ ఫోరమ్‌ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో శ్రీకాంత్‌ మాట్లాడుతూ... ‘శుభవార్త ఏంటంటే... ఇప్పుడు పరిస్థితులు మారాయి. కేవలం పాలనాపరమైన ఇబ్బందులను అధిగమించే సత్తా మీలో ఉంటే.. అమెరికాలాగే భారత్‌ కూడా అద్భుత అవకాశాల గడ్డ. వచ్చే 25 ఏళ్లపాటు భారత్‌ 8 శాతం వృద్ధిరేటును సాధిస్తుంది. ఈ పరిస్థితిని ఒక్కసారి ఊహించుకోండి... అప్పుడు భారత్‌లోని పట్టణాలు, నగరాలు ఎంతగా అభివృద్ధి చెందుతాయో! ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఇండియాలో వ్యాపారాన్ని ప్రారంభించడం ద్వారా సులభంగా ధనవంతులైపోవచ్చు. కొత్త కంపెనీ, కొత్త పరిశ్రమ ఏర్పాటు చేసే సాహసం మీలో లేకపోతే ఉన్నవాటిల్లో పెట్టుబడి పెట్టండంటూ..’ వర్ధమాన పారిశ్రామికవేత్తలకు శ్రీకాంత్‌ పిలుపునిచ్చారు.

ఇక అమెరికాలోని ప్రతిష్టాత్మక మాసాచుసెట్స్‌ ఇన్సిస్టిట్యూట్‌(ఎంఐటీ)లో చేరిన అంతర్జాతీయ తొలి అంధ విద్యార్థిగా పేరుప్రఖ్యాతులు దక్కించుకున్న శ్రీకాంత్‌ తన జీవితానుభవాలను వివరించాడు. ‘భారత్‌ విద్యావ్యవస్థ నన్ను ఓ అంధుడిగానే చూసింది. అటువంటి సమయంలో ఎంఐటీ నన్ను ఆహ్వానించింది. అందుకే ఎంఐటీకి నేనెప్పుడూ రుణపడి ఉంటాను. అమెరికాలో ఎన్నో అవకాశాలున్నప్పటికీ భారత్‌కు తిరిగిరావడానికి కారణమొక్కటే... భారత్‌లో మార్పు తీసుకురావాలి. ఇటీవల జరిగిన అమెరికా ఎన్నికల్లో నేతల ప్రచారమంతా గొప్పగొప్ప అంశాల ప్రాతిపదికనే సాగింది. అదే భారత్‌లో అయితే ప్రజల కనీస అవసరాలకు ఇచ్చే సబ్సిడీ గురించి నేతలు మాట్లాడతారు. తిరిగి అదే సబ్సీడీని పేదలకు అందకుండా చేస్తారు. ఈ పరిస్థితిలో మార్పు రావాలి. అందుకే నైపుణ్యత కలిగిన భారతీయ యువతను స్వయం ఉపాధివైపు నడిపించాలి. ఇందుకోసం ఇప్పుడున్న తరమే ముందుకు రావాల’ని పేర్కొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement