నా కూతురు తప్పు చేసింది.. చంపేశాను | Sakshi
Sakshi News home page

నా కూతురు తప్పు చేసింది.. చంపేశాను

Published Fri, Jun 10 2016 9:14 AM

నా కూతురు తప్పు చేసింది.. చంపేశాను - Sakshi

కరాచీ: పాకిస్తాన్లో ప్రేమ అన్నది పెద్ద నేరంగా మారుతోంది. కుటుంబ సభ్యుల అభీష్టానికి వ్యతిరేకంగా ఎవరైనా పెళ్లి చేసుకుంటే వారిని వేటాడి చంపేస్తారు. అక్కడ పరువుహత్యలు సాధారణమవుతున్నాయి. తాజాగా ఓ తల్లి కన్నకూతురును దారుణంగా చంపేసింది. అనంతరం వీధిలోకి వచ్చి తన కూతురు తప్పు చేసిందని, అందుకే చంపానని ఆమె ఏడుస్తూ చెప్పింది.

లాహోర్లో ప్రవీణ్ రఫిక్ అనే మహిళకు 18 ఏళ్ల కూతురు జీనత్ ఉంది. జీనత్ హాసన్ ఖాన్ అనే మెకానిక్ను ప్రేమించింది. జీనత్ కుటుంబ సభ్యులు అడ్డు చెప్పినా గత నెలలో కోర్టు మేజిస్ట్రేట్ ముందు వారిద్దరూ వివాహం చేసుకున్నారు. పెళ్లయిన తర్వాత జీనత్ నాలుగు రోజులు భర్త ఇంట్లో ఉంది. ఆ తర్వాత కుటుంబ సభ్యులు వెళ్లి జీనత్కు ఎలాంటి హానీ తలపెట్టమని, విందు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి ఆమెను ఇంటికి తీసుకువచ్చారు. జీనత్కు ఇష్టం లేకపోయినా భయపడుతూ పుట్టింటికి వచ్చింది. ప్రేమపెళ్లి చేసుకున్నందుకు జీనత్ను కుటుంబ సభ్యులు వేధించడం మొదలుపెట్టారు. హాసన్ను మరచిపోవాలని తల్లి బెదిరించగా, జీనత్ అంగీకరించలేదు. దీంతో జీనత్ తల్లి ఆమె ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పుపెట్టింది. అనంతరం వీధిలోకి వచ్చి గట్టిగా అరుస్తూ తన కూతురును చంపేసినట్టు ఇరుగుపొరుగు వారికి చెప్పింది. పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు.

పాకిస్తాన్లో ప్రతిఏటా దాదాపు 1000 మంది మహిళలు పరువుహత్యలకు బలవుతున్నారు. తాము కుదిర్చిన వివాహాన్ని చేసుకోకపోయినా, తమకు ఇష్టంలేకుండా ప్రేమ పెళ్లి చేసుకున్న అమ్మాయిలను కుటుంబ సభ్యులు చంపుతున్నారు.

Advertisement
Advertisement