'నా కళ్ల ముందే కుప్పకూలిపోయింది' | Sakshi
Sakshi News home page

'నా కళ్ల ముందే కుప్పకూలిపోయింది'

Published Tue, Apr 28 2015 7:12 PM

'నా కళ్ల ముందే కుప్పకూలిపోయింది'

కాఠ్మండు: శనివారం ఉదయం నేపాల్ రాజధాని కాఠ్మండు నడిబొడ్డున ఉన్న చారిత్రక కట్టడం దర్హారా ప్రాంతం ప్రశాంతంగా ఉంది. నేపాలీలు దీన్ని ఈఫిల్ టవర్గా పిలుచుకుంటారు. ఈ కట్టడం సమీపంలో తపన్ సింగ్ అనే వ్యక్తి బస్ టికెట్ కొనుక్కొనేందుకు క్యూలో నించున్నాడు. అంతలోనే పెనువిపత్తు వచ్చింది. తపన్ కాళ్ల కింద భూమి కంపించింది. తపన్ ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే దర్హారా టవర్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. తొమ్మిది అంతస్తుల (50.5 మీటర్ల ఎత్తు) ఈ టవర్ నేలమట్టమైంది.  

ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తించిన దర్బార్ స్క్వేర్.. తన కళ్ల ముందే కూలిపోయిందని తపన్ కన్నీటిపర్యంతమయ్యాడు. 'దర్హారా టవర్ అటుఇటూ ఊగిపోతూ కూలిపోయింది. ఒక్కసారిగా పెద్ద శబ్దం వినిపించింది. ఆ తర్వాత నిమిషం పాటు ఏమీ అర్థం కాలేదు. ఏమీ వినిపించలేదు' అని తపన్ చెప్పాడు. ఈ పెను ప్రమాదం నుంచి తపన్ సురక్షితంగా బయటపడ్డాడు. అయితే దర్హారా శిథిలాల కింద 250 మందికిపైగా మంది సమాధి అయ్యారు.


రాజరిక నేపాల్‌లో రాణి లలిత త్రిపుర సుందరి ఆదేశాల మేరకు 1832లో అప్పటి ప్రధానమంత్రి భీమ్‌సేన్ తపా ఆధ్వర్యంలో దీని నిర్మాణం జరిగింది. మిలటరీ అవసరాల కోసం, పరిసరాలపై నిఘా ఉంచడానికి ఈ శిఖరం లాంటి నిర్మాణం అప్పట్లో ఉపయుక్తంగా ఉండేది. క్రమేణా ఈ భారీ నిర్మాణం ఖాట్మండు నగరానికే ఒక ప్రధాన ఆకర్షణగా మారింది. అలాంటి ఈ టవర్ చరిత్రలో కలసిపోయింది.

శనివారం సంభవించిన భారీ భూకంపం ధాటికి కొన్ని సెకెన్ల వ్యవధిలో నేపాల్ మరుభూమిగా మారిపోయింది. దాదాపు 5 వేలమంది మరణించగా, మరో 7 వేలమందికిపైగా గాయపడ్డారు. భూకంపం నేపాలీల జీవితంలో అంతులేని విషాదాన్ని మిగిల్చింది.

Advertisement
Advertisement